త్రివిక్రమ్ కాస్త మొండోడే. త్రివిక్రమ్ అనే కాదు, ఆ స్థాయి ఉన్న దర్శకులంతా `నే చెప్పేదే వేదం` అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. వాళ్ల జడ్జిమెంట్, సాధించిన విజయాలూ, వాళ్లకున్న స్టేటస్ – ఇవన్నీ చూసి – వాళ్లకు ఎదురు చెప్పడానికి ఎవ్వరూ సాహసించరు. ఇలాంటి వాళ్లకు సలహాలు ఇవ్వడమూ ప్రమాదమే. ఎందుకంటే ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవ్వరికీ తెలీదు. అలాంటి త్రివిక్రమ్‌కి అలీ ఓ సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏమిటి? దాన్ని త్రివిక్రమ్ పాటించాడా, లేదా..?? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తే…
త్రివిక్రమ్ ప్రతీ సినిమాలోనూ అలీకి ఓ మంచి పాత్ర దక్కుతుంటుంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లోనూ అలీకి ఓ మంచి వేషం ఇచ్చారు. షూటింగ్ పూర్తయ్యింది. ప్రసాద్ ల్యాబ్‌లో డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. అలీ డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఉపేంద్ర నటించిన కొన్ని సన్నివేశాలు చూశారాయన. అప్పటికే ఉపేంద్ర పాత్రకు ఎవరో డబ్బింగ్ చెప్పేశారు. అదీ ఫైనల్ అయిపోయింది కూడా.
ఉపేంద్ర నటించిన సన్నివేశాలు చూసిన అలీ… ”ఈ పాత్రకు ఎవరో డబ్బింగ్ చెప్పారు. కానీ.. గొంతు ఒకలా,. హావభావాలు మరోలా ఉన్నాయి. అస్సలు అతకలేదు” అని త్రివిక్రమ్‌కు చెప్పాడట. మరి ఎవరు డబ్బింగ్ చెబితే బాగుంటుంది? అని అలీని అడిగితే.. ”సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ అయితే బాగుంటుంది” అని సలహా ఇచ్చాడట అలీ. అంతే.. అప్పటికప్పుడు రవి శంకర్ కి ఫోన్ చేసి, కాల్షీట్లు తీసుకుంది చిత్రబృందం. మరుసటి రోజే రవిశంకర్ వచ్చి, నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేసి వెళ్లిపోయాడట. ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చూస్తే ఆ పాత్రకు ఉపేంద్రనే డబ్బింగ్ చెప్పినట్టు అనిపిస్తుంది. ఆ క్రెడిట్ సగం రవి శంకర్‌కి ఇస్తే.. మరో సగం అలీకి ఇవ్వాల్సిందే.