అసలే గోపీచంద్ ఫ్లాపుల్లో ఉన్నాడు. అపజయాల ఊబిలో కూరుకుపోయాడు. ఓ హిట్టు దొరికితే చాలు.. కనీసం ఓ యావరేజ్ పడినా అదే పదివేలు అన్నట్టుంది పరిస్థితి. అందుకే ఇప్పుడు ప్రతీ అడుగూ జాగ్రత్తగా వేస్తున్నాడు. ప్రతీ విషయంలోనూ పది రకాలుగా ఆలోచిస్తున్నాడు.
ప్రస్తుతం సంపత్‌నంది తో ‘సిటీమార్’ చేస్తున్నాడు. ఈ సినిమాపైనే గోపీచంద్ ఆశలన్నీ. క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఎలాగైనా సరే, ఈ సినిమాతో హిట్టు అందుకోవాలని తపనతో ఉన్న గోపీచంద్ ఈ సినిమాని వీర లెవల్లో చెక్కుతున్నాడని టాక్. ఏ సన్నివేశం బాగాలేకపోయినా, అనుకున్నట్టు రాకపోయినా మరుసటి రోజే రీషూట్ పెట్టేస్తున్నాడట. పైగా ద్వితీయార్థం గోపీచంద్ అంచనాలకు తగినట్టుగా లేదని, దాన్ని ఇప్పుడు మరలా తిరగరాయిస్తున్నాడని టాక్. కథ చెప్పినప్పుడే గోపీచంద్ సెకండాఫ్‌పై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే అప్పట్లో సంపత్‌నంది…`ద్వితీయార్థాన్ని మారుస్తా.. ఇంకా బెటర్మెంట్లు వస్తాయి` అని సర్దిచెప్పాడట. అయితే ఇప్పటి వరకూ ఆ బెటర్ మెంట్లు కనిపించకపోయేసరికి.. గోపీచంద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు సంపత్ నంది సెకండాఫ్‌ని మార్చడానికి కుస్తీ పట్లు పడుతున్నాడని టాక్. అటు గోపీచంద్ అనుమానాల్ని, ఇటు సంపత్‌నంది తిరగమోతని తప్పుపట్టలేం. ఎందుకంటే ఏం చేసినా స్క్రిప్టు దశలోనే చేయాలి. తెరపై బొమ్మ పడిపోయాక ఎన్ని అనుకున్నా లాభం ఉండదు. కాకపోతే… సెకండాఫ్ కూడా పూర్తిగా సిద్థమయ్యాకే సినిమా మొదలెట్టాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కాకపోతే… సినిమా ఆలస్యం అవుతుంది. నిర్మాత గాభరా పడతాడు. అంతే తేడా.