ఢీ తరవాత అడపా దడపా ఓ హిట్టు, యావరేజూ అంటూ అప్పుడప్పుడూ మెరిశాడు గానీ, తనదైన మార్కు చూపించలేకపోయాడు విష్ణు. కొన్నాళ్లుగా సినిమా తీసే సాహసమే చేయలేదు. ఎట్టకేలకు మోసగాళ్లు అనే సినిమా పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి ఏమాత్రం బజ్ లేదు. టీజరో, ట్రైలరో వచ్చి షాకింగ్‌గా అనిపిస్తే తప్ప, ఈ సినిమా గురించి ఎవరూ పట్టించుకోరు. ఏదోలా ఈ సినిమాకి క్రేజ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు విష్ణు. ఈ సినిమా బడ్జెట్ రూ.20 నుంచి 30 కోట్ల లోపే. ఆ సినిమానే ఎలా లాక్కురావాలా అని సతమతమయిపోతుంటే.. ఇప్పుడు వంద కోట్ల సినిమాని నెత్తిమీద వేసుకోవాలని చూస్తున్నాడు.
`కన్నప్ప`అనే స్క్రిప్టు విష్ణు దగ్గర ఎప్పటి నుంచో ఉంది. తనికెళ్ల భరణి రాశారు. ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాకి రూ.60 నుంచి 70 కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిసి, అంత భారీ బడ్జెట్ చిత్రాన్ని నేను మోయలేనంటూ ఆయన తప్పుకున్నారు. ఆ తరవాత కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్లు రంగ ప్రవేశం చేశారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తీస్తే.. వర్కవుట్ అవుతుందని భావించారు. దాంతో బడ్జెట్ మరింత పెరిగింది. విష్ణుతో అంత బడ్జెట్ రిస్క్ అని చెప్పి ఆ కథని పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఇప్పుడు మళ్లీ ఈ సినిమాపై విష్ణు మనసు మళ్లింది. ఈసారి బడ్జెట్ మరింత పెరిగింది. దాదాపు వంద కోట్లు అవుతుందని లెక్క గట్టారు. మోసగాళ్లు సినిమా హిట్టయితే తప్పకుండా కన్నప్ప తీస్తానని అంటున్నాడు విష్ణు. మోసగాళ్లు 30 కోట్ల లోపు సినిమా. అది ఎంత హిట్టయినా ఆ డబ్బుని తిరిగి సంపాదించడమే ఎక్కువ. ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసినా, విష్ణు సడన్‌గా వంద కోట్ల హీరో అయిపోలేడు కదా…? అలాంటప్పుడు మోసగాళ్లు సినిమాకీ, కన్నప్పకీ లింకెక్కడ కుదురుతుంది? పాన్ ఇండియా స్థాయిలో తీస్తే ఆ డబ్బులు వసూలు చేయడం అంత కష్టమేమీ కాదన్నది విష్ణు వాదన. చిరంజీవి లాంటి వాళ్లే పాన్ ఇండియా స్థాయికి వెళ్లలేక, ఆపసోపాలు పడుతున్నారిక్కడ. విష్ణు వల్ల అవుతుందా??
కన్నప్ప కథని న్యూజిలాండ్‌లో తీస్తానని, హాలీవుడ్ టెక్నీషియన్లని తీసుకొస్తానని, అందుకే అంత బడ్జెట్ అవసరం అవుతుందని లెక్కగడుతున్నాడు విష్ణు. మన దగ్గర కూడా చాలా టాలెంట్ ఉంది. వాళ్లని వెదికి పట్టుకుని, తనకున్న మార్కెట్ రేంజులో ఈ సినిమాని తీసుకొవొచ్చు. లేదంటే బడ్జెట్ భయాలు, మార్కెట్ లెక్కల మధ్య… తన కలల ప్రాజెక్టు కలగానే ఉండిపోతుంది.