తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో రాజ్యసభ ఎన్నిక చిచ్చు రేపుతోంది. ఉన్నవి రెండంటే రెండే స్థానాలు. ఆశావహులు మాత్రం పదుల సంఖ్యలో. శాసనసభ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు రెబల్స్ ను పోటీ నుంచి తప్పించడానికి ఎడా పెడా హామీలు ఇచ్చేశారు. ఆ హామీలు ఇప్పుడు కారులో చిచ్చు రగిలిస్తున్నాయి అంటున్నారు. రెండు స్థానాలలో ఒక స్థానాన్ని తనకు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, లోక్ సభ మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పట్టుబడుతున్నారు. కవితను రాజ్యసభకు పంపాలంటూ ఇంటి పోరు కూడా ఎక్కువవుతోంది. ఇక ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, జాతీయ స్థాయిలో రాజకీయాలు నెరపుతున్న సీనియర్ నాయకుడు కే.కేశవరావు తనకు మరోసారి అవకాశమివ్వాలని పట్టుబడుతున్నారు. హోం శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి వారిద్దరూ రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇక దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలు కూడా ఈసారి రాజ్యసభకు తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. బీసీల నుంచి బీ.ఎస్.రాములు, దళిత వర్గాల నుంచి మాజీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తమకు అవకాశం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వద్ద పైరవీలు చేస్తున్నారు. ఈ వర్గాలకు చెందిన కుల సంఘాలు రాజ్యసభ స్థానాన్ని తమ నాయకులకు కేటాయించాలంటూ విలేకరుల సమావేశాలలో డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన ఓ పారిశ్రామికవేత్తకు అవకాశం ఇస్తారని తెలంగాణ భవన్ లో ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ స్థానాల కోసం ఇలా అన్ని వైపుల నుంచి కారులో చిచ్చు రగులుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.