అమరావతి కోసం రైతులిచ్చిన భూముల్ని ప్రభుత్వం బహుముఖంగా వాడుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యాభై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా.. మరి కొన్ని వందల ఎకరాలు బ్యాంకుల్లో తనఖా పెట్టి పెద్ద ఎత్తున రుణం తీసుకోవాలనే ప్రతిపాదనను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కార్.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో.. అర్థరూపాయి అప్పుగా తీసుకు రావాల్సిన పరిస్థితి ఉంది. పెరిగిపోతున్న లోటు… తగ్గిపోతున్న జీడీపీ కారణంగా… అప్పులు కూడా పుట్టడం కష్టమన్న అభిప్రాయం ఉంది. దీంతో.. ఆస్తుల అమ్మకం కోసం బిల్డ్ ఏపీ అనే కార్యక్రమం చేపట్టింది. అలాగే.. గుళ్లు, ట్రస్టుల ఆదాయాన్ని తీసుకునేందుకు నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది.
ఇప్పుడు.. ఇతర మార్గాలపైనా దృష్టి పెట్టింది. ఇందులో ప్రభుత్వానికి విలువైనవిగా కనిపిస్తోంది.. రాజధాని భూములే. సీఆర్డీఏ చట్టం ప్రకారం.. రైతులకు ఇవ్వాల్సినవి పోను.. అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు.. ఇతర మౌలిక సదుపాయాలకు పోను.. ప్రభుత్వానికి ఎడెనిమిది వేల ఎకరాల భూమి మిగుల్తుంది. ఈ భూమిని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయగా… ఇంకా ఆరేడు వేల ఎకరాలు మిగుల్తుంది.. వీటిని బ్యాంకుల్లో తనఖా పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ భూములపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి హక్కులు రావాలంటే… అభివృద్ది కోసం భూమి ఇచ్చిన రైతులకు … చట్టం ప్రకారం… వారి భూమి వారికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.
అలా చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నిస్తోంది. వీలైనంత త్వరగా … రైతులకు చేయాల్సిన రిజిస్ట్రేషన్లను చేయాలని సంకల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే.. చట్టం ప్రకారం.. రాజధాని కట్టాలని.. అభివృద్ధి చేయాలని.. అలా చేయకుండా… భూములు పంచడం.. తాకట్టు పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్న రైతుల్ని వస్తోంది. ప్రభుత్వం అన్నీ రహస్యంగా చేస్తోంది. వివరాలు బయటకు వచ్చిన తర్వాతే … ఈ వివాదం కూడా సంచలనం సృష్టించే అవకాశం ఉంది.