స్థానిక ఎన్నికల్లో బీసీ కార్డ్ చాలా పవర్‌ఫుల్‌గా వాడేస్తున్నాయి రాజకీయ పార్టీలు. జనాభాలో సగం ఉన్న బీసీలకు… ప్రభుత్వం రిజర్వేషన్లు కొనసాగించలేకపోయింది. దీంతో ఆయా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇచ్చిన పాతిక శాతం రిజర్వేషన్లు కూడా చాలా జిల్లాల్లో అమలు కావడం లేదు. బీసీలకు కేటాయించిన సీట్ల లెక్కలన్నీ బయటకు తీస్తే.. అది పది శాతమో.. పదిహేను శాతమో తేలుతోంది. ఈ విషయాలన్నీ చర్చనీయాంశమవుతూండటంతో… ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి టీడీపీ అనుకూలంగా మార్చుకుంటోంది. అదే సమయంలో అధికార పార్టీ కూడా తమకు వ్యతిరేకం కాకుండా వ్యూహాత్మకంగా కోర్టు తీర్పు వల్ల తాము రిజర్వేషన్లు ఇవ్వలేకపోయాము కానీ.. సీట్లు మాత్రం ఇస్తామనే ప్రచారం చేయడం ప్రారంభించింది.
రిజర్వేషన్లే ఇవ్వలేని వారు సీట్లు మాత్రం ఇస్తారా.. అని టీడీపీ విమర్శలు ప్రారంభించింది. అంతే కాదు.. తాము బీసీలకు రిజర్వేషన్లతో పని లేకుండా 34 శాతం సీట్లు ఇస్తామని టీడీపీ ప్రకటించి.. వైసీపీకి కౌంటర్ ఇస్తోంది. స్థానిక నాయకత్వానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పరిశీలకుల్ని పంపి… అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ప్రజలతో రాజకీయ పార్టీలు చాలా ఎమోషనల్ గేమ్స్ ఆడతాయి. సామాజికవర్గాల పరంగా రాజకీయాలు చేసేటప్పుడు ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. గత ఎన్నికల్లో ఓ సామాజికవర్గంపై మిగతా అన్ని సామాజికవర్గాలను ఏకం చేయడానికి చేసిన ప్రయత్నాలతో ఇవి పీక్స్‌కు చేరాయి.
ఎన్నికలు ఏవైనా ఇప్పుడు సామాజికవర్గమే కీలకం అవుతోంది. ఓట్లేసేవాళ్లు.. తమ సామాజికవర్గం అని ఓట్లు వేస్తున్నారో లేదో కానీ.. రాజకీయ పార్టీలు మాత్రం.. ఆ మేరకే అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి. పార్టీకి మద్దతుగా ఉండే సామాజికవర్గం.. అభ్యర్థికి మద్దతుగా ఉండే సామాజికవర్గం ఇలా లెక్కలు చూసుకుని అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి. ఈ లెక్కలన్నీ కలిసి.. ఏ పార్టీది ఆధిపత్యం అన్నది కాకుండా.. ఏ గ్రామంలో.. ఎవరిది ఆధిపత్యం అన్న ప్రశ్నే ఉత్పన్నమవుతోంది. దీన్ని రాజకీయ పార్టీలు.. గ్రహించలేకపోతున్నాయి. సామాజిక వర్గ రాజకీయాల్లో గ్రామాలను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి.