అనుకున్నట్లుగానే రిలయన్స్ ప్రముఖుడు పరిమళ్ నత్వానీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు ఖరారు చేశారు. తన తండ్రి మరణంలో రిలయన్స్ కుట్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేసి.. ఇప్పుడు.. ఆ సంస్థ కీలక వ్యక్తినే రాజ్యసభకు పంపుతున్నారు. గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న శేఖర్ రెడ్డి ఇంట్లో నోట్ల రద్దు సమయంలో .. పట్టుబడిన కోట్ల రూపాయలను చంద్రబాబువే అని ఆరోపించిన జగన్.. తాను సీఎం అయిన తర్వాత ఆ శేఖర్ రెడ్డినే పిలిచి అదే పదవి కట్టబెట్టారు. ఇప్పుడు.. రిలయన్స్ విషయంలోనూ అదే రిపీటయింది. ప్రస్తుతం జార్ఘండ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నత్వానీకి అక్కడ చాయిస్ లేకపోవడంతో ఏపీ వైపు చూశారు. జగన్ అడగడమే రెడీ.. ఓ సీటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
మరో మూడు సీట్లను.. ఇద్దరు మంత్రులకు కేటాయిస్తున్నారు. శాసనమండలిలో సభ్యులుగా ఉంటూ.. మంత్రి పదవులు పొందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు.. శాసనమండలి రద్దు కారణంగా మాజీలవనున్నారు. వీరికి న్యాయం చేసేందుకు ఇద్దర్నీ రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించుకున్నారు. మరో సీటు.. తనకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త.. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న రాంకీ గ్రూప్ ఓనర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి ఖరారు చేశారు. రాజ్యసభ అవకాశం చూపి.. పార్టీలో చేర్చుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు, తూ.గో జిల్లాకు చెందిన పండుల రవీంద్రబాబు సహా.. పలువురు ఆశావహులకు జగన్ షాక్ ఇచ్చినట్లయింది. మండలి రద్దు చేస్తున్నారు కాబట్టి.. వారెవరికీ ఎమ్మెల్సీ పదవులు కూడా వచ్చే అవకాశం లేదు.
రాజ్యసభ స్థానాల కోసం చాలా మంది పెద్దలు .. జగన్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. తామున్నామంటూ.. సుబ్బరామిరెడ్డి కుటుంబంతో సహా కలిసి జగన్ ఇంటికి భోజనానికి వెళ్లారు. కేవీపీ కూడా.. ఓ లేఖ రాశారు. చంద్రబాబును విమర్శిస్తూ.. జగన్ ప్రయత్నాల్ని ప్రశంసిస్తూ.. ఈ లేఖ ఉంది. వీరిద్దరి రాజ్యసభ సభ్యత్వం కూడా ముగిసిపోతోంది. చివరి ప్రయత్నంగా వీరిద్దరూ జగన్ పై ఈ కోణంలో ఒత్తిడి తెచ్చారని చాలా మందికి అర్థమైంది. అయితే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వెటరన్ పొలిటికల్ ప్లేయర్స్ని పట్టించుకోలేదు. అనుకున్న వారినే ప్రకటించారు.