రాష్ట్రానికి సంబంధం లేని.. అసలు రాష్ట్రానికి గంట కూడా సమయం కేటాయించలేని గుజరాత్ పారిశ్రామికవేత్తను రాష్ట్ర ప్రజల తపున రాజ్యసభకు పంపాలనే నిర్ణయం అనూహ్యమే. గతంలో తెలుగుదేశం పార్టీ పారిశ్రామికవేత్తల్ని రాజ్యసభకు పంపింది. కానీ.. వారు ఏపీ పారిశ్రామికవేత్తలే. తెలుగుదేశం పార్టీకి తెర వెనుక పని చేసినవారే. నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు వంటి వారు.. టీడీపీ మద్దతుతో బీజేపీ తరపున రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ వారు పారిశ్రామికవేత్తలు కాదు. వారి వల్ల ఏపీకి ఏం ఒరిగిందో.. ఎవరికీ తెలియదు. వారు ఏపీ కోసం… చట్టసభల్లో ఒక్క సారంటే.. ఒక్క సారి కూడా ఏపీ కోసం మాట్లాడిన దాఖలాల్లేవు. అాలంటిది ఇప్పుడు పారిశ్రామికవేత్త కోటాలో రాజ్యసభకు ఎన్నికవుతున్న పరిమళ్ నత్వానీ.. ఏపీ కోసం మాట్లాడతారనుకోవడం… పని చేస్తారనుకోవడం అమాయకత్వమే.
ఎందుకంటే.. ఆయన గత పన్నండేళ్లుగా జార్ఖండ్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ పన్నెండేళ్ల కాలంలో ఆయన ఎంపీగా జార్ఖండ్ కోసం.. ఏం చేశారో ఎవరికీ తెలియదు. అసలు రాజ్యసభ సభ్యుని హోదాలో… అక్కడి ప్రజల కోసమైనా.. పన్నెండు సార్లు జార్ఖండ్ లో పర్యిటించారో లేదో తెలియదు. అయితే.. ఏపీకి మాత్రం … పరిమళ్ నత్వానీ తరచుగా వస్తారు. రాజ్యసభ పదవికి న్యాయం చేయడానికి కాదు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి. ఇలా ఎన్ని సార్లు వస్తే.. అన్ని సార్లు లెక్కలేసుకుని తాను వచ్చానని చెప్పుకుంటారేమో..? ఏపీకి ఎంత న్యాయం చేస్తారన్న విషయం పక్కన పెడితే… జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రి మరణంలో ఎవరి హస్తముందని ఆరోపించారో.. వారికే.. పిలిచి మరీ రాజ్యసభ సీటివ్వడం… సామాన్యుల మనసుల్లో ఖచ్చితంగా ఓ ముద్ర వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి… తమ మనోభావాలతో రాజకీయ ఆట ఆడుకున్నారన్న అభిప్రాయం మాత్రం బలపడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే సోషల్ మీడియాలో నిఖార్సైన వైఎస్ అభిమానులు నేరుగానే ప్రశ్నిస్తున్నారు. దేశంలో బలమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్న జగన్.. ఇలా… గతంలో తాను ఆరోపణలు చేసిన వ్యక్తులు అడగకముందే పదవులిచ్చి ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో శేఖర్ రెడ్డి అని కాంట్రాక్టర్ ను.. టీటీడీలో నియమించే విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు నత్వానీ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇప్పటికి ఇవి మామూలుగానే ఉండొచ్చు కానీ… తర్వాత తర్వాత జగన్ నైతికతను ప్రశ్నించేలా చేస్తాయి.