రాజ్యసభ సభ్యులుగా మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను జగన్ ఖరారు చేశారు. వీరి ఎంపికలో ప్రధానంగా పని చేసింది.. బీసీ కోణమే. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హైలెట్ చేస్తున్న ఒకే ఒక్క అంశం బీసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి కుదించటంతో బీసీలకు 24.15 శాతం మాత్రమే రిజర్వేషన్లు వచ్చాయి. అంతకుముందు 34 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లకుండా బీసీలకు అన్యాయం చేసిందని తెలుగుదేశంతోపాటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆచరణలో ఈ రిజర్వేషన్లు ఇంకా తక్కువగా ఉన్నాయని రికార్డులు బయట పెడుతున్నారు.
ఒకదశలో వైసీపీ కూడా ఎదురుదాడి చేయలేకపోయింది. ఈ విమర్శల నుంచి బయటపడేందుకు బీసీ వర్గాలకు చెందిన మంత్రులిద్దరికీ రాజ్యసభ టికెట్లిచ్చి పెద్దల సభకు పంపటం ద్వారా తాము బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని వైసీపీ నిర్ణయించింది. దీంతోపాటు కేబినెట్ లో రెండు స్థానాలు ఖాళీ అవుతుండటంతో మంత్రి పదవులు కూడా మరో ఇరువురికి దక్కే అవకాశం ఉంది. మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మండలి రద్దు చేస్తే.. వారికి ఎమ్మెల్సీ పదవే కాదు.. మంత్రి పదవి కూడా పోతుంది. దీంతో ప్పటికీ వారిరువురికి ఇంతకంటే ఉన్నతమైన పదవులు కట్టబెడతానని ప్రకటించారు. ఆ మేరకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ టికెట్లను ఖరారు చేశారు.
బీసీలపై తమకు ఉన్న చిత్తశుద్ధిని ఇద్దరికి టిక్కెట్లు ఇవ్వడం ద్వారా నిరూపించామని వైసీపీ చెబుతోంది. బీసీలకు న్యాయం చేయడానికి జగన్.. సొంత బాబాయ్ సుబ్బారెడ్డిని కూడా పట్టించుకోలేదని… అంటున్నారు. అయితే.. రాజ్యసభ హామీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేర్చుకున్న ప్రముఖ బీసీ నేత నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు మాత్రం జగన్ హ్యాండిచ్చారు. దీంతో ఆయన వర్గీయులు నిరాశకు గురయ్యారు.