పులివెందుల సతీష్ రెడ్డి… ఈ పేరు రాష్ట్రంలో అందరికీ చాలా చిరపరిచితమే. ఎందుకంటే.. రాష్ట్రంలో అత్యంత బలమైన కుటుంబమైన వైఎస్ ఫ్యామిలీపై ఆయన చిరకాలంగా పోరాడుతున్నారు. ఎలాంటి ఎన్నికలొచ్చినా ఆయన నిలబడుతున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎదురిస్తున్నారు. అలాంటి సతీష్ రెడ్డి ఇప్పుడు అలసిపోయారు. వైసీపీలో చేరాలని అనుకుంటున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ కుటుంబసభ్యులతో చర్చలు జరిపారు. వారు కూడా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్యకర్తలతో సమావేశమైన తర్వాత.. సతీష్ రెడ్డి నిర్ణయం ప్రకటించనున్నారు. కొద్ది రోజులనుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. పులివెందుల టీడీపీ వ్యవహారానలు ఎమ్మెల్సీ బీటెక్ రవి చూసుకుంటున్నారు.
సతీష్ రెడ్డి టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పులివెందులకు అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరించారు. కొన్ని వందల కోట్ల రూపాయల నిధులను.. తీసుకొచ్చి నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు. పెద్ద ఎత్తున అనుచరులకు ఆర్థికగా లబ్ది చేకూర్చారు. ప్రాజెక్టులు కూడా పూర్తి చేశారు. గండికోట ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ గడ్డం తీయనని శ్రమించి.. ఆయన ఆ మేరకు.. పూర్తి చేసిన తర్వాతే గడ్డం తీశారు. ఐదేళ్ల కాలంలో పులివెందులలో పెద్ద ఎత్తున నీరు పారినా.. గత ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వానికి ప్రజల మద్దతు లభించలేదు. ఎప్పటిలాగే అక్కడ వైఎస్ జగన్ హవా కనిపించింది. అంతకు ముందు ఎమ్మెల్సీగా ఉన్నా.. రెండో సారి.. ఆయన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేయలేదు. యువనేత బీటెక్ రవిని నిలబెట్టి గెలిపించారు.
అయితే.. ఇప్పుడు సతీష్ రెడ్డి.. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోతోందని భావిస్తున్నారు. అధికార పార్టీలో ఉంటే.. కొంత భద్రత ఉంటుందని అనుకున్నారేమో కానీ..వైసీపీతో సంప్రదింపులు జరిపారు. ఆ మేరకు చేరికకు ఏర్పాట్లు చేసుకుటున్నారు. కొసమెరుపేమిటంంటే… సతీష్ రెడ్డిపై.. గతంలో వైసీపీ నేతలు ఎన్నో ఆరోపణలు చేశారు.. అందులో కీలకమైనది.. రాజారెడ్డి హత్య. ఆ హత్య కేసులో సతీష్ రెడ్డి కీలకమని..స్వయంగా వైఎస్ కుటుబంసభ్యులే చెబుతూంటారు. అయినా ఇప్పుడు వారు సతీష్ రెడ్డినిపార్టీలోకి తీసుకునేందుకు అంగీకరించారు. ఓ వైపు .. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదం వెనుక రిలయన్స్ ఉందని ఆరోపించిన జగన్ అదే రిలయన్స్‌కు చెందిన నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇప్పుడు రాజారెడ్డి హత్య కేసులో నిందితుడని ఆరోపించిన సతీష్ రెడ్డిని కూడాపార్టీలో చేర్చుకుంటున్నారు.