చిరంజీవి – కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ఫిక్సయ్యింది. చిత్రబృందం ఈ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించకున్నా – ఓ ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి నోరు జారి `ఆచార్య`అనే పేరు చెప్పేశారు. దాంతో ఈ సినిమా టైటిలేంటో జనాలకు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్ మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దానికి రెండు ప్రధాన కారణాలున్నాయి.
ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మరో కథానాయకుడు కూడా నటిస్తాడని (మహేష్ బాబు కావొచ్చు) ప్రచారం జరుగుతోంది. అలాగైతే ఇది మల్టీస్టారర్ చిత్రం అయిపోతుంది. మరో హీరో అభిమానుల్నీ సంతృప్తిపరచాలంటే ఇద్దరు హీరోల పాత్రలకు సంబంధించిన పేరు టైటిల్లో కనిపించాలి. అప్పుడే ఈ చిత్రానికి అసలు సిసలైన మల్టీస్టారర్ ముద్ర పడుతుంది. ఇది వరకు ఈ చిత్రానికి గోవింద ఆచార్య అనే పేరు అనుకున్నారు. ఆ తరహా పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి.
ఇక రెండో కారణం.. ఈ సినిమా పేరుని ఎలాంటి హడావుడీ లేకుండా ప్రకటించేయడం చిత్రబృందానికి ఏమాత్రం నచ్చలేదు. ఈ సినిమా పేరు ప్రకటించడంతోనే పబ్లిసిటీ మొదలెట్టాలని భావించారు. కానీ చిరు పొరపాటున నోరు జారడంతో టైటిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ టైటిల్‌కి కాస్త అటూ ఇటూ మార్చి కొత్త టైటిల్ అన్నట్టు విడుదల చేస్తే బాగుంటుందన్నది మరో ఆలోచన. చిరంజీవి తో పాటు ఇందులో నటించే మరో హీరో ఎవరు అనేదాన్ని బట్టే టైటిల్ ఉండబోతోంది, చరణ్, బన్నీలాంటి కుటుంబ హీరోతోనే సర్దుకుపోతే టైటిల్ మారే అవకాశం లేదు. అలాకాకుండా మహేష్ లాంటి హీరో వస్తే మాత్రం ఈ టైటిల్‌ని పొడిగించే అవకాశాలున్నాయి.