రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భవనాలు పడిన వైసీపీ రంగులను పది రోజుల్లో తీసేయాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. ఇలా ప్రభుత్వ కార్యాలయాలకు ఓ పార్టీ పరమైన రంగులు ఉండటం.. రాజ్యాంగ విరుద్దమని ఆరోపిస్తూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వాటిని పది రోజుల్లోగా తొలగించాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల కోడ్ ప్రకారం.. సహజంగానే.. రంగులన్నింటినీ తొలగించాల్సి ఉంది. అయితే… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాత్రం.. అవి ఓటర్లపై ప్రభావం చూపవని చెప్పారు. దాంతో రంగుల తొలగించరని అనుకున్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గుడి, బడి తేడా లేకుండా పెద్ద ఎత్తున మూడురంగులు పూశారు. ఎన్ని విమర్శలు వచ్చినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. శాఖల వారీగా.. రంగుల విషయంలో… అధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజాధనం ఖర్చు చేశారు. దాదాపుగా పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో ఎంత వాస్తవం ఉందన్నదిస్పష్టంగా తేలకపోయినా.. ఖర్చు మాత్రం భారీగానే ఉంటుందనే అంచనా ఉంది. ఇలాంటి సమయంలో.. స్థానిక ఎన్నికలు రావడంతో.. వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాగోలా వాటిని ఉంచేద్దామనుకున్నా.. కోర్టు తీర్పు ప్రకారం.. తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికీ మళ్లీ తెల్ల రంగులు వేయడానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది.
అవి వైసీపీ రంగులు కాదని.. ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. కానీ.. పార్టీ రంగులో కాదో తాము పోల్చుకోగలమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణ జరిపి.. ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సచివాలయాలు కూడా.. ప్రభుత్వ భవనాలు కిందకే వస్తాయి కాబట్టి.. వాటి రంగులు కూడా తొలగించాల్సి ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలపై జగన్ బొమ్మను కూడా పెట్టారు. ఇప్పుడు వాటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం.. హైకోర్టు తీర్పును పాటిస్తుందా.. లేక ప్రత్యామ్నాయం ఏమైనా చూస్తుందా.. అన్నదే ఆసక్తికరం.