ఇద్దరు బీసీ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి రాజ్సభ సీట్లు ఇవ్వడంతో.. ఆ రెండు మంత్రి పదవుల కోసం వైసీపీలో రేస్ ప్రారంభమయింది. ఆ రెండు మంత్రివర్గ ఖాళీల్లోనూ బీసీలనే తీసుకోవడం ఖాయం. ఎన్నికల్లో తేడా ఫలితాలు వస్తే.. మంత్రులు ఎవరైనా తొలగిస్తారనే ఊహాగాలను పక్కన పెడితే.. రెండు బెర్తులు మాత్రం బీసీ వర్గాలకు ఖాయమయ్యాయి. దీంతో.. వైసీపీలోని బీసీ నేతలు.. తమ దూకుడు ప్రారంభించారు. ఇలాంటి వారిలో అందరి కంటే ముందు ఉన్న నేత .. పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారధి. ఆయన వైఎస్ హయాంలోనే మంత్రిగా చేశారు. కృష్ణా జిల్లా నుంచి బీసీ నేతగా ఎదిగారు. ఆయనకు మొదట మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు కానీ.. కొడాలి నాని, పేర్ని నాని ఖాతాలో పడిపోయాయి. అప్పుడే ఆయన అసంతృప్తికి గురయ్యారు.
ఇప్పుడు బీసీ కోటాలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తన నియోజకవర్గంలో భారీ ఫలితాల్ని సాధించడంతో పాటు.. ముఖ్యమంత్రిని ఆకర్షించేందుకు.. బీసీ నినాదాన్ని పార్టీ తరపున గట్టిగా వినిపించడం ప్రారంభించారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లను చంద్రబాబే అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు జగన్ ఇచ్చారని … జగన్ కన్నా గొప్పగా బీసీలకు ఎవరూ సాయం చేయలేదన్నట్లుగా ప్రకటలు చేస్తున్నారు. అయితే పార్ధసారధికి మాత్రం.. కృష్ణా జిల్లా నుంచి బీసీకోటాలో పదవి రావాలంటే.. కొడాలి నానికో.. పేర్ని నానికో పదవి ఊడాల్సిందే.
గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి బీసీ పదవులు ఖాళీ అయ్యాయి. ఆయా జిల్లాల నుంచే పదవులు భర్తీ చేయాలి. లేకపోతే.. జిల్లాల సమతూకం దెబ్బతింటుంది. ఆయా జిల్లాల నుంచి గెలిచిన బీసీ నేతల్లో ఎక్కువ మంది కొత్త వాళ్లే ఉన్నారు. అలాంటి వారికి అవకాశం దక్కుతుందో .. సీనియర్లుగా తమను జగన్ గుర్తిస్తారో లేదోనని పార్థసారధి లాంటి వాళ్లు నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు.