రిలయన్స్ కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్.. కాబోయే.. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి నివాసంలో కలిశారు. రాజ్యసభ సీటు ఇచ్చినందుకు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. పదకొండో తేదీన నామినేషన్ వేస్తానని నత్వానీ ప్రకటించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని నత్వానీ మీడియా ముందు చెప్పుకొచ్చారు. పరిమళ్ నత్వానికి గత పన్నెండేళ్లుగా.. రాజ్యసభకు జార్ఖండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పన్నెండేళ్ల కాలంలో ఆయన జార్ఖండ్ కోసం ఎంతగా ప్రయత్నించారో.. ఎన్ని పరిశ్రమలు తీసుకు వచ్చారో.. చెప్పి.. ఆ తర్వాత అదే పద్దితిలో ఎపీ కోసం పని చేస్తానని ప్రకటించి ఉంటే… కాస్త నమ్మశక్యంగా ఉండేది.
జార్కండ్ నుంచి … ఎంపీగా ఎన్నికవడమే కానీ.. ఆయన జార్ఖండ్ గురించి .. రాజ్యసభలో మాట్లాడింది కూడా చాలా తక్కువే. ఇక పరిశ్రమల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన రాజ్యసభ ఎంపీగానే చాలా మందికి తెలుసు..రిలయన్స్ కోటాలో రాజ్యసభకు వస్తున్నారని కూడా తెలుసు..కానీ ఏ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారో..సగం మంది రాజ్యసభ సభ్యులకు కూడా తెలియని అంటూంటారు. ఈ సారి జార్ఖండ్లో కాంగ్రెస్ – జేఎంఎం కూటమి గెలవడంతో.. అక్కడ గెలుపొందడానికి అవకాశం లేకపోయింది.
జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వడానికి ఉత్సాహం చూపడంతో ఏపీకి వచ్చారు. ఇక్కడ సీటు ఇచ్చారు కాబట్టి.. ఏపీ కోసం ఆయన ఏదో చేస్తానని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా.. పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల ఆయన పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తారని అనుకునే అవకాశం లేదు. ఆయన ఓ రాజ్యసభ సీటును త్యాగం చేయడానికి కారణాలు వేరే ఉన్నాయని చాలా మంది నమ్మకం. ఆ కారణాలేమిటో.. తర్వాత తర్వాత బయటపడే అవకాశం ఉంది.