కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఛాన్సుల మీద ఛాన్సులు ఇస్తున్నారు తెరాస మంత్రులు! ఎలా అంటారా… కాస్త నోరు జారి విమర్శలు చేయడం ద్వారా! ప్రతిపక్ష పార్టీల నాయకులు కుక్కల్లా మొరుగుతున్నారనీ, వాళ్లలాగ మేమూ మొరగలేమంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజే, మరో మంత్రి ఎర్రబెల్లి కూడా అసెంబ్లీలో… కోమటిరెడ్డి రాజగోపాల్ ని ఉరికించి కొడతారని వ్యాఖ్యానించారు. ఈ మాటల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గానే తీసుకున్నారు. తలసాని వ్యాఖ్యలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని తెరాస భావిస్తోందని విమర్శించారు. తెరాస మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారనీ, ఎందుకు అంత సహనానికి గురౌతున్నారని నిలదీశారు. తమని ప్రశ్నించేవారు ఉండకూడదన్నట్టుగా వ్యవహరిస్తున్నారనీ, ప్రతిపక్షాల బాధ్యతే ప్రజల తరఫున ప్రశ్నించడమని భట్టి చెప్పారు. తలసానితోపాటు, ఇతర మంత్రులు కూడా ఈ మధ్య దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ ఖజానాను తెలంగాణ మంత్రులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని భట్టి ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆస్తుల్ని కాపాడటం కోసం వాచ్ డాగ్స్ లాగా ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తిస్తూనే ఉంటారన్నారు. రాష్ట్రాన్ని దొంగల్లా దోపిడి చేస్తున్నారు కాబట్టి, ఈ దోపిడీని చూస్తూ తాము ఊరుకోలేమనీ, ఈ దొంగతనాలపై వాచ్ డాగ్స్ లాగ తాము మొరుగుతూనే ఉంటామనీ, ప్రజలకు వాస్తవాలు చెబుతామన్నారు.
వాస్తవానికి, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే, భాజపా నాయకుల్నీ ఉద్దేశించి ఎర్రబెల్లి విమర్శలు చేశారు. అయితే, భాజపా నుంచి ఎవ్వరూ దీనిపై స్పందించలేదు! నిజానికి, ఈ సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు తెరాసకు కాస్త ధీటుగానే స్పందిస్తున్నారని చెప్పొచ్చు. మంత్రులు కూడా ఇలా కాస్త నోరు జారే సరికి… ఈ అవకాశాన్ని విమర్శనాస్త్రంగా వాడుకుంటున్నారు.