మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఎసరు పెట్టినట్లుగా తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ను కూల్చేందుకు అవకాశం ఉందేమో చూడాలంటూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ కమలనాథులకు సూచించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితిలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ వంటి నాయకులు కేసీఆర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారిని ఆయుధంగా చేసుకుని కేసీఆర్ సర్కారును కూల్చే అవకాశం ఉందేమో పరిశీలించాలని బీజేపీ సుప్రీమ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నాయకులకు వర్తమానం పంపినట్లు పార్టీ వర్గాల సమాచారం. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా ఆ సర్కారును దించేసినట్లుగానే తెలంగాణలో కూడా అవకాశం ఉందేమో చూడాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేంద్ర తో సహా పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట ఉన్న మాట వాస్తవమేనని, వారు పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకుంటే ఎంత మంది మద్దతు పలుకుతారన్నది లెక్కలు వేయాలని అమిత్ షా సూచించినట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి అయితే ఆ పాచిక పారే వచ్చునన్నది స్థానిక కమలనాథుల ఆలోచన. కేటీఆర్ ముఖ్యమంత్రి కాగానే పార్టీలో అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారని, కేసీఆర్ కు అనుకూలమైన సీనియర్ నాయకులను, ప్రజా ప్రతినిధులను కేటీఆర్ పక్కన పెడతారన్నది తెలంగాణ కమలనాథుల అభిప్రాయం. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే పార్టీ చీలిపోవడం ఖాయమని, చీలిక వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తే మంచిదని స్థానిక నాయకులు చెబుతున్నారు. అయితే తెలంగాణని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి పార్టీ సుప్రీం అమిత్ షా పావులు కదుపుతూనే ఉంటారని బీజేపీ తెలంగాణ నాయకులు చెబుతున్నారు.