సాయిధరమ్ తేజ్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం… ఉప్పెన. ఇందులోని రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. వాటికి మంచి స్పందన వస్తోంది. పాటల్లో దేవిశ్రీ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడి అవతారం ఎత్తాడు. బుచ్చి బాబు సుక్కు ప్రియమైన శిష్యుడు. ససుకుమార్ కథలన్నీ సున్నితమైన భావోద్వేగాలతో నడుస్తాయి. కథ, కథనాల విషయంలో బుచ్చిబాబు గురువుని ఫాలో అయిపోయాడట. కాకపోతే క్లైమాక్స్ విషయంలో మాత్రం… బుచ్చి తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది.
తెలుగు సినిమాల్లో ఇంత వరకూ చూడని క్లైమాక్స్‌ని ఈ సినిమా కోసం రాసుకున్నాడట బుచ్చిబాబు. సినిమా అంతా ఒక ఎత్తని, క్లైమాక్స్ మరో ఎత్తని, సినిమా చూసొచ్చాక క్లైమాక్స్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటారని చిత్రంలో పనిచేసిన ఓ కీలకమైన సభ్యుడు హింట్ ఇచ్చాడు. ఆ క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చిందన్నదాన్ని బట్టే ఈ సినిమా జయాపజయాలు నిర్ణయింపబడతాయని చెబుతున్నారు. సో.. ఉప్పెన ఆయువు పట్టు పతాక దృశ్యాల్లోనే ఉందన్నమాట. క్లైమాక్స్ లో వైష్ణవ్ తేజ్ నటన కట్టిపడేస్తుందని, అప్పటి వరకూ ఒకలా కనిపించిన వైష్ణవ్… చివర్లో మరోలా కనిపించడం మొదలెడతాడని, తొలి సినిమాతోనే నటుడిగా తానెంటో నిరూపించుకునే అవకాశం దక్కిందని చెబుతున్నారు. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు విజేత ఉన్న సినిమాలో నటుడిగా మార్కులు లాక్కోవాలంటే కష్టమే. నిజంగానే.. వైష్ణవ్ తేజ్ విజయ్ సేతుపతికి ధీటుగా పోటీ ఇస్తే… అంతకంటే కావల్సిందేముంది?