శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం శ్రీకారం. ఈ సినిమాతో కిషోర్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిజానికి ఇదో షార్ట్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కిషోర్ ఓ షార్ట్ ఫిల్మ్ తీసి, దర్శకుడిగా తనకు అవకాశం కల్పించమని 14 రీల్స్ సంస్థని సంప్రదించాడట. ఆ షార్ట్ ఫిల్మ్‌లోని ఐడియాలజీ నచ్చి – ఈ కథని సినిమాకి తగినట్టు మలచమని సూచించడంతో ఆ షార్ట్ ఫిల్మ్‌నే సినిమాని తగినట్టుగా మార్చుకుని స్క్రిప్టు రాశాడట. అలా శ్రీకారం… శ్రీకారం చుట్టుకుంది. రైతు సమస్య నేపథ్యంలో నడిచే చిత్రమిది. ఇది వరకు రైతు సమస్యలపై కథానాయకుడు చేసే పోరాటం నేపథ్యంలో చాలా చిత్రాలొచ్చాయి. అయితే వాటికి భిన్నంగా శ్రీకారం సాగుతుందని, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఆరాటపడే ఈతరం కుర్రకారుకి ఈ సినిమా ఓ కనువిప్పులా ఉంటుందని చెబుతున్నారు. కేవలం రైతు సమస్యలపైనే ఫోకస్ చేయకుండా వినోదం, ప్రేమకథ.. తదితర విషయాలపై దర్శకుడు దృష్టి పెట్టాడని, రైతు కథని వాణిజ్య కోణంలో చెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.