సినిమాకి సంబంధించిన చిన్న వీడియో బిట్ రిలీజ్ చేయాలన్నా చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు దర్శక నిర్మాతలు. టీజర్, ట్రైలర్ మినహాయిస్తే… విడుదలకు ముందు పెద్దగా ఫుటేజీని బయటకు వదలరు. సింగిల్స్‌గా పాటలు విడుదల చేస్తున్నప్పుడు ఆ పాటకు సంబంధించిన మేకింగ్ నో, ఆ పాట ఫొటోలనో, సాహిత్యాన్నో ఓ వీడియోగా మలని విడుదల చేస్తారు. అల వైకుంఠపురములో విషయంలో చిత్రబృందం కాస్త భిన్నంగా ఆలోచించింది. ఆ పాటకు పనిచేసిన గీతకారుల్ని, సంగీత కారుల్నీ తెరపైకి తీసుకొచ్చి ఓ వీడియోని రూపొందించారు. అవి బాగా క్లిక్ అయ్యాయి. ఇప్పుడొస్తున్న కొత్త సినిమాలు కొన్ని అదే స్టైల్ ఫాలో అవ్వడానికి చూస్తున్నాయి.
ఉప్పెన పాటలు రెండు ఇటీవలే విడుదలయ్యాయి. సుకుమార్ శిష్యుడు చిత్రమిది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమాపై జనం ఫోకస్ పెట్టడం సహజమే. లిరికల్ వీడియోల స్థానంలో ఈ సినిమాకి సంబంధించిన విజువల్ వీడియోలు బయటకు వచ్చేశాయి. రెండు పాటల వీడియోలూ బయటకు వదిలేసింది చిత్రబృందం. రాబోయే పాటల విషయంలోనూ ఇదే పంథా అనుసరించబోతోందని టాక్. పాటలు ముందే చూపించేడయం వల్ల.. ఈ సినిమా జోనర్, కలర్, కాస్ట్యూమ్స్ ఇలా.. అన్నీ రివీల్ అయిపోతున్నాయి. ఓరకంగా ప్రేక్షకుల్ని సినిమా మూడ్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇది. పాటలు ఎలాగూ బాగున్నాయి కాబట్టి.. యూ ట్యూబుల్లో పదే పదే చూసుకునే అవకాశం ఉంటుంది. అలా కావల్సినంత పబ్లిసిటీ.
విడుదలకు ముందే పాటలు ఇన్ని సార్లు చూసేసిన తరవాత… మళ్లీ కొత్తగా థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ కిక్ ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానాలు రావొచ్చు. కాకపోతే.. పబ్లిసిటీలో ఇదో రకమైన ప్రక్రియ. ప్రేక్షకుడు సినిమా గురించి ఏదేదో ఊహించుకోకుండా రాకుండా.. అడ్డు కట్ట వేసే మంత్రం. ఉప్పెన విషయానికొస్తే.. ఈ రెండు పాటల్లోనూ హీరోయిన్ కృతి శెట్టి చాలా అందంగా కనిపించింది. తన లుక్స్‌తో యువతరానికి గాలం వేసింది. ఆమె కోసమైనా యువతరం థియేటర్లకు వచ్చే అవకాశాలే ఎక్కువ. సో.. ఉప్పెన చిత్రబృందం టార్గెట్ కూడా అదే కావొచ్చు. అందుకే పాటలతో ఎర వేస్తున్నారిలా.