తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ నియమితులయ్యారు. ఆయన పేరును ఆరెస్సెస్ కూడా సూచించిందని గతంలో కూడా కథనాలు వచ్చాయి. మరోసారి కొనసాగిస్తారన్న ధీమాతో లక్ష్మణ్ ఉన్నా, చివరికి సంజయ్ వైపే జాతీయ నాయకత్వం మొగ్గు చూపింది. పార్టీ అధ్యక్షుడి హోదాలో లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రెస్ మీట్లలో, సభల్లో మాట్లాడుతున్నా… కేసీఆర్ ధీటైన వాయిస్ గా ఆయనది వినిపించలేదు. పైగా, ఆయన హయాంలో పార్టీ ఘన విజయాలు సాధించిన ట్రాక్ రికార్డూ లేదు. ఇవన్నీ ఆయనకి మైనస్ అయ్యాయి. బండి సంజయ్ నియామకం వెనక పార్టీ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రెండు రకాల సందేశాలను భాజపా జాతీయ నాయకత్వం ఇస్తోంది!
మొదటిది… ఏదో ఒక స్థాయిలో, రాష్ట్రంలో కేసీఆర్ కి అనుకూలంగా భాజపా వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని ఇకపై పూర్తిగా చెరిపేయడం! సీఎం కేసీఆర్ మీద సంజయ్ ధీటైన విమర్శలే చేస్తుంటారు. తెరాసపై ఆయన బలంగా పోరాటం చేయగలరనేది గతంలో కొన్ని సందర్భాల్లో చూశాం. సంజయ్ నాయకత్వంలో తెరాసపై రాజీలేని పోరాటం కొనసాగుతుందనే అభిప్రాయం ఇప్పుడు మరింత బలంగా కనిపిస్తోంది. ఇక, రెండోది… తెలంగాణలో బలమైన హిందుత్వ అజెండాతోనే భాజపా ముందుకు సాగుతుందని చెప్పడం! హిందుత్వను కాపాడేందుకే భాజపా ఉందని కుండబద్దలు కొట్టి చెబుతుంటారు సంజయ్. అంతేకాదు, ఎమ్.ఐ.ఎమ్. విషయంలో కూడా ఎలాంటి సన్నాయి నొక్కుల దోరణినీ ఆయన ప్రదర్శించిన దాఖలాలు లేవు. సంజయ్ ని నియమించడం ద్వారా… తెలంగాణలో కేవలం హిందుత్వ అజెండాతో ముందుకు సాగుతుందనే సంకేతాలు ఇస్తోందని చెప్పొచ్చు.
హైదరాబాద్ కేంద్రంగా సంజయ్ పనిచేస్తే, నగరంలో భాజపా మరింత బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. భాగ్యనగరంలో రాజకీయంగా వేడి పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంకోపక్క, కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భాజపాకి మంచి వాయిస్ ఉన్న నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. కాంగ్రెస్ కి కూడా ఇప్పుడు అదే స్థాయి గొంతు కావాలి. మొత్తానికి, సంజయ్ నియామకం భాజపాకి కొత్త బలాన్ని పెంచే అంశంగా మారేట్టుగా ఉంది.