జనసేన. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అధ్యక్షుడిగా వెలసిన రాజకీయ పార్టీ. వుయ్ ఆర్ సమ్ థింగ్ డిఫరెంట్ అంటూ రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టిన పార్టీ. మాకు అందరూ సమానమే. మాకు కులాలు లేవు. మతాలు లేవు. ప్రజా సంక్షేమమే మా లక్ష్యం. ప్రజలే మా న్యాయ నిర్ణేతలు. ఇవన్నీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నినాదాలు. ప్రజలే మా సిద్ధాంతం అంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన జనసేన ఇప్పుడు ఆ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లే కనపడుతోంది. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో కలసి పనిచేసింది జనసేన. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అంశాలలో ఆ పార్టీతో విబేధించింది. ఇక ప్రత్యేక హోదాపై బీజేపీని తీవ్ర స్ధాయిలో విమర్శించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఆ తర్వాత తెలుగుదేశం, బీజేపీలకు వ్యతిరేకంగా తాను పోరాడతానంటూ వామపక్షాలతో కలిసారు. వారితో ఏడాది కూడా కలిసి నడవకుండానే మళ్లీ బీజేపీతో చేతులు కలిసారు. ఇవన్నీ ఏ సిద్దంతానికి సంబందించినవో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పలేక పోతున్నారు. తాజగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్దానిక సంస్థల ఎన్నికలలో ఒక్కో జిల్లాలో ఒక్కోపార్టీతో కలసి పోటీ చేసేందుకు క్షేత్ర స్దాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీతో కలసి పోటీ చేస్తామంటూ ప్రకటించారు పవన్ కల్యాణ్. అయితే తెర వెనుక మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలోను తెలుగుదేశం పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు జన సైనికులు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్నికలో బరిలో ఉన్నా వారినీ ఓడించడమే తెలుగుదేశం, జనసేనల లక్ష్యంగా కనబడుతోంది. ఇక వామపక్షాలు బలంగా ఉన్న విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాలలో సీపీఐ, సీపీఎం పార్టీలతో కలసి పోటీ చేసేందుకు స్దానిక జనసేన నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ జిల్లాల్లో బీజేపీ పోటీలో ఉన్న వారి గెలుపు కోసం జన సైనికులు పనిచేసే అవకాశం లేదు. ఇలా జిల్లాల వారీగా పలు ప్రాంతాలలో బలాలా వారీగా జనసేన పోటీ చేయాలని నిర్ణయించడంపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా బద్ద వైరంతో ఉన్న పార్టీలతో ఓ జిల్లాలో యుద్దం… మరో ప్రాంతంలో స్నేహం చేయడం ఏ సిద్దాంతం అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.