గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కీలకమైన తుది అంకం మాత్రం మిగిలి ఉంది. గురువారం నాడు మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. తెరాస పార్టీలోని ఆశావహులంతా ఈ రెండు కీలక స్థానాలను దక్కించుకోవడానికి పార్టీలోని అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే పార్టీలో ప్రస్తుతం కీలకంగా కనిపిస్తున్న కొత్త మార్పు ఏంటంటే.. నగర పదవుల గురించి సిఫారసు చేయాల్సిందిగా పార్టీలో ఎంతటి అగ్రనేత అయినప్పటికీ హరీష్‌రావు వద్దకు ఎవ్వరూ వెళ్లడం లేదుట. హరీష్‌రావుతో సిఫారసు చేయించుకుని వెళితే.. అయ్యే పని కూడా చెడిపోతుందేమోనని చాలా మంది నాయకులు భయపడుతున్నారుట.
హరీష్ కోటరీకి చెందిన నాయకులు, ఆశావహులు కూడా ఇతర నాయకుల్ని ఆశ్రయించి.. తమను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నారట.
నిజానికి పార్టీలో ఇది కొత్త పరిణామం అని చెప్పుకోవాలి. సాధారణంగా మొన్న మొన్నటి వరకు పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ.. హరీష్‌రావు, కేటీఆర్‌ల పెత్తనం ఈక్వల్‌గా నడుస్తూ ఉంటుందని బయట వినిపిస్తూ ఉండేది. వీరిద్దరి పెత్తనం ఎంత ఎక్కువగా ఉండేదంటే.. ఇతర మంత్రిత్వ శాఖల్లో కొన్ని కీలక పోస్టుల్లో ట్రాన్స్ఫర్లు చేయాలన్నా సరే.. మంత్రులు వీరి అనుమతి తీసుకునే వారని గుసగుసలు వినిపిస్తూ ఉండేవి. అలాంటిది హరీష్‌రావు ప్రాధాన్యం క్రమంగా తగ్గుతున్నదా అనుకోడానికి ఇలాంటి పరిణామాలు దారితీస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను మొత్తం కేటీఆరే పర్యవేక్షించాడు గనుక.. ఆయనకు కొత్తగా పట్టణాభివృద్ధి శాఖ పట్టాభిషేకం కూడా చే
శారు గనుక.. మేయర్, డిప్యూటీల ఎంపిక పూర్తిగా ఆయన ఇష్టానుసారమే జరుగుతుందని, కేటీఆర్‌కు సిఫారసు చేయడానికి కూడా హరీష్ ఒప్పుకోకపోవచ్చునని నేతలు ఆయనను ఆశ్రయించడం కూడా లేదుట. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల దెబ్బకి తెరాసలో ఆధిపత్య పోరాటాలు కూడా తారస్థాయిలో బయటపడుతున్నట్లుంది.