తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే.. జేసీ బ్రదర్స్‌లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి… మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనకు అక్కడే చెక్ పెట్టాలని.. తాడిపత్రిలో ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి డిసైడయ్యారు. తాడిపత్రిలో 30వ వార్డు నుంచి… జేసీ ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయగానే… కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన కుమారుడు హర్షారెడ్డితో… ఆయనపై పోటీకి నామినేషన్ వేయించారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తాడిపత్రి పట్టణం, మున్సిపాల్టీ దశాబ్దాలుగా జేసీ సోదరుల చేతుల్లోనే ఉంది. 2014లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
అంతకు ముందు జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా .. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉండేవారు. జేసీ ప్రభాకర్ రెడ్డి హయాంలో తాడిపత్రి మున్సిపాల్టీ బాగా అభివృద్ధి చెందింది. దేశంలోనే అత్యంత శుభ్రమైన మున్సిపాలిటీల్లో ఒకటిగా పేరు పొందింది. అనేక అవార్డులు గెలుచుకుంది. మున్సిపాల్టీకి పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రతీ ఇంటి ముందు మొక్క ఉండాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశించి.. దాని ప్రకారం చెట్లు పెంచేలా ప్రజల్ని ప్రోత్సహించారు. అయితే..అప్పటి పరిస్థితులు వేరు.
ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రస్తుతం జేసీ బ్రదర్స్ ఉక్కపోత ఎదుర్కొంటున్నారు. పార్టీ అధికారం కోల్పోయింది. అలాగే.. తమ వారసులూ ఓడిపోయారు. మరో వైపు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ అనుచరుల్ని టార్గెట్ చేసి దూరం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. మున్సిపల్ చైర్మన్‌గా మళ్లీ గెలిచేందుకు.. జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఆయనను అక్క డ వరకూ రానీయకుండా చేసేందుకు పెద్దారెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతో తాడిపత్రి రాజకీయం రాజుకుంటోంది.