కరోనా మెల్లమెల్లగా జనజీవనాన్ని అతలాకుతలం చేయడం ప్రారంభించింది. కరోనా భయాలతో… స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఐపీఎల్ ఆగిపోయే ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఇదే పరిస్థితి చిత్రసీమ ఎదుర్కొనే అవకాశం ఉంది. జనం గుమ్మిగూడే ఎలాంటి ప్రయత్నాలనూ, కార్యక్రమాలకూ ప్రోత్సహించవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఐపీఎల్ చూడ్డానికి ఈసారికి ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కీ ప్రేక్షకులకు ఎంట్రీ లేదని తెలుస్తోంది.
క్రమంగా ఈ ఎఫెక్ట్ థియేటర్లపైనా పడనుంది. కొంతకాలం థియేటర్లు మూసేస్తే ఎలా ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. జన సంచారం ఎక్కువగా ఉన్న చోట్ల కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. స్టేడియాలు, థియేటర్లు, షాపింగు మాళ్లలో… కరోనా విజృంభించే ప్రమాదం ఉంది. అందుకే… జన సమూహాలు ఏర్పడకుండా ప్రపంచంలోని పలు దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఫుట్ బాల్ స్టేడియాల్లోకి జనాన్ని అనుమతించకపోవడంతో అవన్నీ బోసిబోతున్నాయి. కేన్స్ చిత్రోత్సవాల్ని కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా వేశారు. ఐపీఎల్ కీ కరోనా గండం ఉంది. విదేశీ ఆటగాళ్లకు వీసాల్ని అనుమతించడాన్ని కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దాంతో ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లను చూసే అవకాశం లేకుండా పోతోంది. స్టార్లు లేకుండా ఐపీఎల్‌ని నిర్వహించడం సాధ్యం కాదు. అలాగని ఐపీఎల్‌ని రద్దు చేసినా, వాయిదా వేసినా చాలా నష్టాన్ని భరించాల్సివస్తుంది. అందుకే జనం లేకుండానే ఖాళీఆ స్టేడియాలలో మ్యాచ్‌లు నిర్వహించడానికి బీసీసీఐ మొగ్గు చూపిస్తోంది. స్టేడియంలోకి జనాన్ని అనుమతించని ప్రభుత్వం.. థియేటర్లలోకి ఎందుకు అనుమతిస్తుంది? అందుకే కొన్ని రోజుల పాటు థియేటర్లని మూసేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే.. చిత్రసీమకు అది పెద్ద దెబ్బే. ఎందుకంటే వేసవి చాలా కీలకమైన సీజన్. ఎన్నో సినిమాలు వేసవి బరిలో దిగడానికి ఎదురుచూస్తున్నాయి. వాళ్లందరికీ ఇది షాక్ లాంటి వార్తే.