కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ద్వారా ఆయన కోరింది ఏంటంటే… తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని వెంటనే నియమించాలని! ఢిల్లీ, కర్ణాటక పీసీసీ అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో, అదే తరహాలో తెలంగాణకు కూడా అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయాలని సోనియాని కోరారు. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటే ఆయన చెప్పారు. ఆయన వెళ్లింది స్వకార్యం కోసమేలెండి. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఎలాంటి కార్యాచరణతో పార్టీని ముందుకు తీసుకెళ్తానో సోనియా గాంధీకి వివరించినట్టు కోమటిరెడ్డి చెప్పారు. ఇదే మాట తాను పదేపదే చెబుతూ ఉన్నాననీ, తనకు బాధ్యతలు అప్పగిస్తే సాధారణ కార్యకర్తల్లో ఒకడిగా పని చేస్తానని అంటున్నాననీ, నేనేదో అధ్యక్షుడినీ, అంతా నేను చెప్పినట్టే జరగాలనే ధోరణిలో వ్యవహరించను అన్నారు. తనకు అవకాశం ఇస్తే 24 గంటలూ ప్రజల్లోనే ఉంటానని మరోసారి మేడమ్ కి చెప్పానన్నారు.
పీసీసీ రేసులో కొంతమంది ఉంటే ఉండొచ్చనీ, నేను కూడా వాళ్లతో రేసులో లేననీ, నేను మాత్రమే రేసులో ఉన్నా అన్నారు కోమటిరెడ్డి! నిన్న మొన్న పార్టీలోకి వచ్చినవాడిని కాదు కదా… అంటూ, పరోక్షంగా ఎంపీ రేవంత్ రెడ్డిపై పంచ్ వేశారు. 36 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నాననీ, ఒకవేళ తనకు కాకపోతే.. సీనియర్లకు ఎవ్వరికి ఇచ్చినా, వాళ్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా అన్నారు. ఇస్తే తనకి, లేదంటే సీనియర్లకి అనేది చాలా స్పష్టంగా చెప్పారు! అంటే, కొత్తవారికి వద్దని మరోసారి చెప్పినట్టే.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం జరిగిన మర్నాడే కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లడం కొంత ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు పీసీసీలు నియమిస్తున్నారు కాబట్టి, తెలంగాణకు ఇప్పుడే నియమించేయాలన్న అభిప్రాయం పక్కన పెడితే… రాష్ట్రంలో భాజపా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది కాబట్టి, కాంగ్రెస్ కూడా ఇంకా ఆలస్యం చెయ్యకూడదన్నది వాస్తవం. ఇప్పటికే కాంగ్రెస్ నెమ్మదిగా వెనకబడుతూ ఉందనే అభిప్రాయం తెలంగాణలో బలంగా ఏర్పడుతోంది. పైగా, నాయకుల ఫోకస్ అంతా కొత్త పీసీసీ నియామకం చుట్టూనే ఉంది. ఐకమత్యం లోపం నూటికి నూరుపాళ్లూ ఉంది. ఈ పరిస్థితికి ఎప్పుడు చెక్ పడుతుందో తెలీదు.