చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేల్ని కొన్నాడు. నేను అలా కాదు.. ఎవరైనా రాజీనామాలు చేసిన తర్వాతనే పార్టీలో చేర్చకుంటా..! .. ఈ నీతి వాక్యాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల సార్లు చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో కూడా చెప్పారు. కానీ.. ఇప్పటికి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల్ని తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే.. ఇక్కడే తన రాజకీయ తెలివి తేటల్ని ప్రదర్శిస్తున్నారు. కండువా కప్పలేదని.. పార్టీలో చేర్చుకోలేదని చెబుతున్నారు. ఇది ప్రజల్లో మరీ కామెడీ అవుతోంది. కండువా కప్పుకోకపోయినంత మాత్రాన పార్టీలో చేరినట్లు కాదా..? అన్న ప్రశ్న వస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చెప్పింది.. నైతిక విలువల గురించే. రాజకీయాల్లో తాను తీసుకొస్తానన్న కొత్త తరహా విలువల గురించే చెప్పేవారు. దానికి అందరి మద్దతు కావాలని అడిగేవారు. జగన్ చెప్పిన మాటలు జనానికి నచ్చాయేమో కానీ.. అందరూ మద్దతు పలికారు. అయితే.. ఇప్పుడు.. చెప్పిన దానికి భిన్నంగా జరుగుతోంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోవడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీలను పార్టీలో చేర్చుకున్నారు. కానీ.. ప్రజల ముందు మాత్రం చేర్చుకోలేదని.. కండువా కప్పలేదని చెబుతున్నారు. కానీ వారు వైసీపీలోకి వెళ్లారని అందరికీ తెలుసు.
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మభ్యపెట్టడానికి కండువా కప్పలేదు. కానీ.. ప్రజలకు తెలుస్తుంది కదా..! నేరుగా చేర్చుకోకపోతే.. చేర్చుకోనట్లు ఎలా అవుతుందని.. జగన్ చెప్పిన దానికి.. చేస్తున్నదానికి తేడా ఉందని ప్రజలు అనుకోకుండా ఉంటారా..? జగన్మోహన్ రెడ్డి గతంలో ఫిరాయింపులపై ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా.. అదంతా ప్రజల మెప్పు కోసమే. చట్టం మెప్పు కోసం కాదు. ఆ ప్రజలు మెచ్చి అధికారం ఇచ్చారు. ఇప్పుడు వారినే తాను చెప్పినదానికి భిన్నంగా చేస్తూ.. మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతిమంగా తీర్పు చెప్పేది ప్రజలే.