అధికారం అండతో.. వైసీపీ నేతల్ని ఇబ్బడిమబ్బడిగా చేర్చుకున్న చంద్రబాబు.. ఆ ప్రభావం అంత కంటే.. తీవ్రంగా తన పార్టీని ఇబ్బంది పెట్టిందని వేగంగానే తెలుసుకున్నారు. అధికారం అనే ఆయుధం ఉండటంతో.. అప్పటికప్పుడు.. అందరూ సర్దుకున్నారు. కానీ అధికారం పోయిన వెంటనే ఆ ఉక్కపోతను భరించలేక… బయటపడటం ప్రారంభించారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. వివిధ రకాల పోరాటాలు.. ఎన్నికల సమయంలో టీడీపీని దెబ్బకొట్టాలని.. ప్రోత్సహిస్తున్న వలసలు.. వైసీపీలో వివిధ నియోజకవర్గాల్లో కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి.
కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావును చేర్చుకున్న వైసీపీ .. ఇప్పుడు ఆయన వల్ల రెండు నియోజకవర్గాలల్లో వర్గ పోరు ప్రారంభమవుతుందని అంచనా వేయలేకపోతున్నారు. కనిగిరి, దర్శిల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే సమయంలో.. టీడీపీకి ఆయన ఎక్స్ట్రాగా మారారు. ఆయన పార్టీలో ఉంటే.. బాలకృష్ణ సన్నిహితుడిగా గౌరవం ఇవ్వాల్సి ఉండేది. చంద్రబాబు ఇబ్బందిపడేవారు. కానీ ఆయనే గుడ్ బై చెప్పడంతో టీడీపీకి సమస్య తీరినట్లయింది. ఇప్పుడా సమస్య వైసీపీ నెత్తిన పెట్టుకున్నట్లయింది. కరణం బలరాం విషయంలోనూ అంతే. ఇప్పటికే.. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతను తీసుకున్నారు. ఇంత మంది నేతల మధ్య పరిస్థితి ఏ లెక్కన మారుతుందో అంచనా వేయడం కష్టమే. ఇక జమ్మలమడుగులోనూ అదే పరిస్థితి. టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి… మండలి రద్దు సమయంలో వైసీపీకి మద్దతిచ్చిన ఎమ్మెల్సీ చదిపిరాళ్ల శివనాథరెడ్డి ఉన్నారు. వీరందరూ కలిసి ఫైట్ చేయబోతున్నారు.
ఇబ్బడిమబ్బడిగా చేర్చుకుంటున్న నేతలతో టీడీపీని దెబ్బకొడుతున్నామన్న ఆనందం వైసీపీకి వస్తోంది. అయితే వచ్చిన వారిని తన సొంత పార్టీ వారిని ఎకతాటిపైకి తేవడం ఎలా అన్నదానిపై పార్టీ అధిష్టానం దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న వాదనలు పార్టీ నేతల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. ఎమ్మెల్సీ పదవులు లేవు.. రాజ్యసభ కోటా అయిపోయింది. అందర్నీ పదవులతో అకామిడేట్ చేసినా.. అసలైన సమయంలో.. నేతలంతా ఎవరి అవకాశాలు చూసుకుంటూ వారు ఎగిరిపోతారు.