ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరు భారతీయ జనతా పార్టీని మనస్థాపానికి గురి చేసింది. రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయని.. తక్షణం జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఏపీలో పరిస్థితులు చేయిదాటితే కేంద్రానికి రాస్తామని హైకోర్టు హెచ్చరించిన తర్వాతి రోజే.. బీజేపీ నేతలు పరిస్థితులు చేయి దాటిపోయాయని నేరుగా కేంద్ర హోంమంత్రిని కలవడం… ఆసక్తి రేపుతోంది. ఎన్నికల అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారని … నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని బీజేపీ ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు చెప్పినా వైసీపీ పార్టీ రంగులను తొలగించలేదన్నారు.
ఎన్నికల సంఘం, డీజీపీ సరైన తీరులో స్పందించకపోతే.. రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని.. కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంది జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చర్యలు తీసుకుంటామని..అమిత్ షా హామీ ఇచ్చారని సీఎం రమేష్ ప్రకటించారు. పోలీసుల తీరుపై నిఘా ఉంటుందని గ్రహించాలన్నారు. విజయనగరం జిల్లాలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అసలు.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అదే డిమాండ్ తో ఎంపీలు నేరుగా అమిత్ షాను కలిశారు.
మరో వైపు టీడీపీ కూడా.. బీజేపీ డిమాండ్‌తో శ్రుతి కలుపుతోంది. రాష్ట్రంలో పరిస్థితులు కేంద్రం జోక్యం చేసుకోవడానికి తగ్గట్లుగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అంటోంది. ఇప్పటికి గవర్నర్‌కు మూడు సార్లు ఫిర్యాదు చేశామని..ఆయన స్పందించలేదని.. ఇప్పటికైనా స్పందించి.. తక్షణం రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక పంపాలని…. టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే శాంతిభద్రతల అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిది. ప్రభుత్వమే.. శాంతిభద్రతలు లేకుండా చేయాలనుకుంటే తప్పని పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకోక తప్పదన్న విశ్లేషణ బీజేపీ నుంచి వస్తోంది.