ఎంపీ అయిన రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దాదాపుగా పది రోజులు అవుతోంది. బెయిల్ కూడా లేదు. ఆయనపై పెట్టిన డ్రోన్ కేసులో గరిష్టంగా శిక్ష నెల రోజులు. ఇలాంటి పరిస్థితిని తెలంగాణలోని ఏ మీడియా ప్రశ్నించడం లేదు. మిగతా మీడియా మొహమాటానికి పోయి… ఒకటి అరా వార్తలిస్తున్నాయి. రెండు చానళ్లు మాత్రం హోరెత్తిస్తున్నాయి. అయితే అది పాజిటివ్ గా కాదు. నెగెటివ్ గా. రేవంత్ జైల్లో ఉండే ఈ మీడియా మాత్రం… ఆయన భూకబ్జాదారుడని.. డ్రోన్లు అక్రమంగా ఎగరేస్తారని తీర్పులు చెబుతూ…ప్రసారాలు చేసేస్తున్నాయి.
సాధారణంగా చట్ట విరుద్ధమైన పనులు జరిగినప్పుడు బాధితుల పక్షాన మీడియా నిలబడుతుంది. ఇక్కడ మాత్రం రేవంత్ నే దోషిగా తేల్చి ప్రసారాలు చేసేస్తోంది. ఓ ఎంపీని అరెస్ట్ చేయడానికి కొన్ని పద్దతులు ఉంటాయి. అవేమీ లేదు. అసలు అది నిరూపించదగిన కేసు కాదని.. న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో.. ఎవరైనా రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం.. సమయం పట్టింపులు లేకుండా ప్రసారం చేస్తున్నాయి. జగ్గారెడ్డి , వీహెచ్ లాంటి వాళ్లు రేవంత్ పై ఫైరయినా… అరగంట అయినా ప్రసారం చేసేస్తున్నాయి.
మరో వైపు జాతీయ మీడియా మాత్రం.. ఓ ఎంపీని అక్రమంగా నిర్బంధించారని చెబుతున్నాయి. కాంగ్రెస్ స్థానిక నేతలు.. రేవంత్ ను.. ఒంటరిని చేయగా..ఢిల్లీ నేతలు మాత్రం..ఆయన కోసం ప్రత్యేక లాయర్ల బృందాన్నే పంపించారు. మొత్తానికి కొంత మందికే కాదు.. వారి అధీనంలో ఉన్న మీడియాకు కూడా రేవంత్ ప్రతిపక్ష నేతగా మారిపోయారు. తమ ప్రతిపక్ష నేతపై.. మీడియా ప్రమాణాలు లాంటివి ఏమీ పట్టించుకోకుండా .. పోరాటం చేస్తున్నాయి.