మాచర్లలో టీడీపీ నేతలపై పట్ట పగలు హత్యాయత్నం చేసిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేస్తున్న వైసీపీ.. విశాఖలో ఆ చాన్స్ మర్డర్ కేసులో జైలుకెళ్లొచ్చినవాళ్లకి ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విశాఖ మేయర్ రేసులో దామా సుబ్బారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ దామా సుబ్బారావు ..వైసీపీ నేతగా చాలా హడావుడి చేస్తారు. గత ఎన్నికల్లోనూ చురుకుగా వ్యవహరించారు. అయితే ఆయన బ్యాక్గ్రౌండ్లో చాలా క్రిమినల్ కేసులతో నిండి ఉంది. ముఖ్యంగా… విశాఖలో మూడేళ్ల కిందట.. గేదెల రాజు అనే రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఆయన హత్య వెనుక ఉన్నఈ దామా సుబ్బారావేనని అప్పుడే పోలీసు విచారణలో తేలింది. కానీ ఆయన బెయిల్ పై బయటకు వచ్చి వైసీపీ తరపున రాజకీయాలు చేసేస్తున్నారు.
గేదెల రాజు అనే వ్యక్తి రౌడీషీటర్. ఆయన దామా సుబ్బారావు..దాసరి రవిబాబు అనే మరో పోలీసు అధికారితో కలిసి దందాలు చేసేవారు. అయితే హఠాత్తుగా.. గేదెల రాజు హత్యకు గురయ్యారు. ఇందులో… ఏ-3 నిందితుడిగా దామా సుబ్బారావు ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి గాజువాకలో స్థిరపడిన సుబ్బారావు.. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఎదిగాడు. పోలీసులకు అధికారులకు, లంచాలిచ్చి.. పనులు చక్కబెట్టుకునేవాడు. బెదిరింపుల కోసం రౌడీషీటర్ గేదెలరాజును చేరదీశాడు. పోలీసు అధికారిగా ఉన్న దాసరి రవిబాబు తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న పద్మలత అనే మహిళను చంపాలనుకున్నారు. దానికి దామా సుబ్బారావు.. తన వద్ద పని చేస్తున్న గేదెల రాజును ఉపయోగించారు. అయితే.. ఈ హత్య లావాదేవీల్లో తేడా వచ్చింది.
గేదెల రాజు.. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోతే మొత్తం బయటపెడతానని హెచ్చరించడంతో సీఐ రవిబాబు, దామా సుబ్బారావు తమ ఉమ్మడి స్నేహితుడు భూపతిరాజు శ్రీనివాసరాజుని రంగంలోకి దింపి.. గేదెల రాజుని పక్కా పథకంతో హత్య చేయించారు. పోలీసుల విచారణలో ఇవన్నీ బయటపడ్డాయి. అప్పట్లో మీడియాలో సైతం సంచలనం సృష్టించింది. ఇప్పుడీ దామా సుబ్బారావే వైసీపీ తరపున మేయర్ అభ్యర్థిగా తెరపైకి రావడం.. కలకలం రేపుతోంది. నేరాలు చేయడమే వైసీపీలో పదవులు పొందడానికి ఏకైక అర్హత అన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.