రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు.. వ్యక్తిగత శత్రువులుగా మారిపోతున్నారు. అధికారంలో ఉన్న వారు.. ప్రతిపక్ష పార్టీల నేతల్ని కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. బండబూతులతో విరుచుకుపడుతున్నారు. అదంతా రాజకీయం.. ఎంత దిగజారిపోయినా.. రాజకీయం అంతే అని సరిపెట్టుకుంటాం. కానీ.. మీడియా సంస్థలు కూడా.. తమకు ఇష్టం లేని రాజకీయ నేతలపై అసభ్య పదజాలంతో దూషించడం ఇప్పుడు కొత్తగా ప్రారంభమైంది. తెలుగు జర్నలిజంలో.. ఓ ట్రెండ్ సెంట్ చేసిన టీవీ9 ఈ ట్రెండ్ కూడా సెట్ చేస్తోంది. ఎంపీ రేవంత్ రెడ్డిపై కొన్ని రోజుల నుంచి అదే పనిగా కథనాలు ప్రసారం చేస్తున్న టీవీ9కు అనుకున్నంత ఎఫెక్ట్ రాలేదేన్న అసహనం వచ్చిందోమో కానీ ఒక్క సారిగా రేవంత్ పై వాడు ..వీడు.. గ్రీడీ అంటూ చెడామడా తిట్టిస్తూ.. యాంకర్‌తో ఓ పెద్ద కథనం చదివించేశారు.
సాధారణంగా గారు అనే గౌరవ వచనాలు… మీడియాలో నిషిద్ధం. ప్రధానమంత్రినైనా నరేంద్రమోడీ అనే అంటారు. అలాగని ఇష్టం లేని వాళ్లను గాడు అని సంబోధించరు. అసలు అలా రాయాలనే ఆలోచన… జర్నలిజంలో ఉన్న వారికి ఇప్పటి వరకూ ఎవరికీ వచ్చి ఉండదు. మొదటి సారిగా టీవీ9 జర్నలిస్టులకు వచ్చింది. రేవంత్ రెడ్డిపై కసికొద్ది రాసేశారు. దాన్ని యాంకర్ దేవి.. తనదైన ఇంటెన్సిటీతో చదివి.. ఎంత కసితో రాశారో.. అంత కసికి ప్రాణం పోశారు. రేవంత్ పైన.. ఆయన కుటుంబంపైనా.. అదే తరహా వాక్యాలు అందులో ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ఓ ఎంపీ. ఆయన నేరస్తుడని తీర్పివ్వాల్సింది టీవీ 9 కాదు. అలా తీర్పిచ్చి.. ఇష్టం వచ్చినట్లుగా తిట్టడానికి మీడియా సంస్థకు తమకు హక్కు ఉందని టీవీ9 జర్నలిస్టులు, యాజమాన్యం భావిస్తున్నట్లుగా ఉంది.
ఇలా ఎందుకు రాయాల్సి వచ్చిందో అని అరా తీస్తే.. అందులో పని చేస్తున్న వారు కొంత సమాచారం చెప్పీచెప్పకుండా చెబుతున్నారు. అదేమిటంటే.. టీవీ9 కొత్త యాజమాన్యానికి బడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఓ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి కేసు వేశారు. దాంతో ఆ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకునే పరిస్థితి. అదే జరిగితే.. కొన్ని వేల కోట్ల పెట్టుబడి ఇరుక్కుపోతుంది. ఆ కారణంతోనే రేవంత్ రెడ్డిపై కొద్ది రోజులుగా కథనాలు ప్రసారం చేస్తున్నా.. జనం లో ఎఫెక్ట్ రావడం లేదు. డ్రోన్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో.. ఆయనకు మరింత సానుభూతి పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. అగ్ర చానల్‌గా ఉండి.. రేవంత్ పై వ్యతిరేకత పెంచడంలో.. విఫలమయ్యారని.. కొంత యాజమాన్యం .. కిరీటాలు పెట్టుకున్న వారిపై విరుచుకుపడిందట.. దాంతో.. జర్నలిస్టులు ఆ కసిని రేవంత్ ను చెడామడా తిట్టడం ద్వారా… కొత్త యాజమాన్యాన్ని శాటిస్ఫై చేసేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఒకరిని చూసి ఒకరు మీడియాలో ఈ తిట్ల ట్రెండ్ ను అందుకుంటారేమో..?