పులివెందుల లాంటి ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గంలోనే కాదు.. విజయవాడ వంటి నగరంలోనూ దాడులు, దౌర్జన్యాల పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొత్తం అభాసుపాలయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటర్లను భయపెట్టి.. వారిని ప్రలోభపెట్టి.. ఓట్లు వేయించుకోవడం కంటే.. అసలు ప్రత్యర్థుల్నే పోటీ చేయకుండా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అధికార పార్టీ పెద్దలకు వచ్చినట్లుగా ఉంది. అందుకే.. ఏకగ్రీవాల కోసం అంటూ.. దాడులు, దౌర్జన్యాలతో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అనే తేడా లేకుండా… పోటీ చేయడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ అదే ట్రీట్‌మెంట్.
పోలీసులు అధికార పార్టీకి మాత్రమే సేవలందిస్తారా..?
ఇంత జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారు.. చోద్యం చూస్తున్నారు. చాలా చోట్ల వారే.. అధికార పార్టీ నాయకుల తరపున రంగంలోకి దిగి.. ప్రత్యర్థులు ఉపసంహరించుకునేలా బెదిరింపులకు కూడా దిగారు. వినని చోట్ల.. దొంగ కేసులు కూడా నమోదు చేశారు. కర్నూలు జిల్లా డోన్‌లో… టీడీపీ తరపున ఎన్నికలను తానై నిర్వహిస్తున్న ధర్మారెడ్డి అనే నేత ఇంట్లో…అలంకరణకు ఉంచిన చిన్న కత్తుల్ని స్వాధీనం చేసుకుని కేసు పెట్టేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేశారు. అందరిపైనా అదే తరహా వేధింపులు ఉండటంతో.. టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక పట్టపగలు.. ఇద్దరు టీడీపీ నేతలపై వైసీపీ నేత హత్యాయత్నం చేసిన మాచర్లలో ఇతరులు నామినేషన్లు వేయలేకపోయారు. హత్యాయత్నం చేసిన తురక కిషోర్ అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేశారు. ఇతరులెవరైనా నామినేషన్లు వేస్తే అంతు చూస్తామని ఆయన మాచర్ల మొత్తం తిరిగారు. చివరికి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
ఎన్నికల సంఘం పని ప్రెస్‌నోట్లు చదవడమేనా..?
ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సిన రాష్ట్రఎన్నికల సంఘం ఏం చేస్తుందో రాజకీయ పార్టీలకు అర్థం కావడం లేదు. జరుగుతున్న అక్రమాలపై.. దాడులపై.. ఎప్పటికప్పుడు నేతలు.. ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ ఆయన మాత్రం స్పందించడం లేదు. సాయంత్రానికి అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని గంభీరమైన ప్రకటన వస్తోంది. అసలు మొత్తం అక్రమాలే జరుగుతున్నాయని కళ్ల ముందు వీడియోలు ప్రదర్శిస్తున్నా.. గంభీరమైన ప్రకటనతే తప్ప చర్యలు ఉండటం లేదు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీడియా ముందుకు వస్తారు… ప్రెస్ నోట్లు చదవుతారు.. వెళ్తారు. లేదా ఆయన పేరుతో ప్రెస్ నోట్ విడుదలవుతుంది.
ఏపీలో వ్యవస్థలకు కరోనా సోకినట్లేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు.. ఏ వ్యవస్థ చూసినా… కరోనా సోకినట్లుగా మారిపోయింది. పోలీసులు ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పనులు మానేసి.. వైసీపీ తరపున ప్రత్యర్థుల్ని వేటాడుతున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు. హైకోర్టు అక్షింతలేసినా పోలీసుల తీరులో మార్పు రాలేదు. ఇక ఎన్నికల కమిషన్ పనితీరు ఎంత వివాదాస్పదం అవుతుందో చూస్తూనే ఉన్నారు. ధర్మాన్ని కాపాడితే.. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే వ్యవస్థలు. ఏ వ్యవస్థల్ని నాశనం చేస్తారో అదే వ్యవస్థలు తర్వాత వెంటపడే అవకాశం ఉంది.