విశాఖలో భూకబ్జాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. చెప్పే ఉదాహరణ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. అది ఉదాహరణ కూడా కాదు. ఆయన స్వీయానుభవం. పదిహేడేళ్ల కిందట.. విశాఖ జిల్లా కాపులుప్పాడ, భీమిలి ప్రాంతాల్లో కన్నా లక్ష్మినారాయణ భూములు కొనుకున్నారు. ఆ భూములను కబ్జా చేశారట. ఇన్నాళ్ల నుంచి ఎవరూ భూములు జోలికి రాలేదు కానీ.. వైసీపీ వచ్చిన తర్వాత మాత్రం.. తన స్థలం చుట్టూ కంచె వేసి కబ్జా చేయడానికి సిద్ధమైపోయారన్నారు. 1993లో చేపలుప్పాడలో స్థలం కొన్నానని .. తన స్థలం పక్కనే పోలీసు అధికారి స్థలం ఉందన్నారు. ఆ స్థలాన్ని కూడా కొట్టేసే ప్రయత్నం చేశారని.. విషయం తెలిసి ఆ పోలీసు అధికారి తనకు ఫోన్ చేసి అలెర్ట్ చేశారని.. వెంటనే.. స్థలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశానన్నారు.
అప్పుడే భూకబ్జాదారులు.. అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థలం అనుకోలేదని కబ్జాదారులు చెప్పారన్నారు. అంటే.. సామాన్యుడిదైతే.. ఏదో విధంగా బెదిరించి… రాయించేసుకునేవారనే అర్థంలో కన్నా మొత్తం ఘటనను వివరించారు. ఇలాంటి ఘటనలు..కొన్ని వందలు జరిగాయని.. వైసీపీ భూమాఫియాకు వందలాది మంది బలయ్యారని మండిపడ్డారు. విశాఖలో బీజేపీ ఆఫీసు పక్కన ఉన్న స్థలం కబ్జాకు ప్రయత్నం చేశారని.. గన్ గురి పెట్టి సెటిల్మెంట్లు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
విశాఖలో పెద్ద ఎత్తున భూ కబ్జా వ్యవహరాలు నడుస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కన్నా లక్ష్మినారాయణ తన భూమి కబ్జా విషయం చెప్పడం కలకలం రేపుతోంది. భూ దందాల కోసమే… విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా చేయాలనుకుంటున్నారని… కొన్నాళ్లుగా వస్తున్న విమర్శలకు .. కన్నా స్థలం విషయం జరిగిన తంతు బలపరిచేలా చేస్తోంది. కన్నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల సంగతేమిటనేది పెద్ద ప్రశ్న.