తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఢిల్లీ ఏఐసిసి వర్గాలు నేరుగానే చెబుతున్నాయి. రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసులో జైలులో ఉండటంతో.. ప్రకటన ఆలస్యం అవుతోందని అంటున్నారు. రేవంత్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ప్రకటన ఉంటుందని.. ఇప్పటికే.. టీ కాంగ్రెస్‌లోని కొంత మంది ముఖ్యులకు సమాచారం అందింది. రెండు రోజుల కిందట…కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా.. డీకే శివకుమార్‌ను ప్రకటించారు. అలాగే ఢిల్లీకి అనిల్ చౌదరి అనే నేతను పీసీసీ ప్రెసిడెంట్‌ను చేశారు. అప్పుడే రేవంత్ రెడ్డి కి పీసీసీ పదవి ఇస్తూ ప్రకటన చేయాల్సి ఉంది. కానీ.. ఆయన జైల్లో ఉండటంతో పెండింగ్‌లో పెట్టారు.
రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం కూడా వ్యూహాత్మకమేనని.. పీసీసీ ప్రకటన వస్తుందని తెలిసిన తర్వాతే.. కాంగ్రెస్ హైకమాండ్ పనరాలోచన చేసేందుకే.. కొంత మంది కాంగ్రెస్ నేతలు అధికార పార్టీకి సమాచారం ఇచ్చి మరీ ఈ పొలిటికల్ గేమ్ ఆడారన్న ప్రచారం ఊపందుకుంటోంది. రేవంత్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. సల్మాన్ ఖుర్షిద్ నేతృత్వంలో ఓ ప్రత్యేక లాయర్ల బృందాన్నే పంపింది. ఇప్పటికే రేవంత్ తన పోరాట పటిమతో.. కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిని ఆకర్షించారు. రాహుల్ గాంధీ గుడ్ లుక్స్‌లో ఉన్నారు. రేవంత్‌కే గత ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వాలనుకున్నా.. సీనియర్లు చాలా మంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో.. వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరి పెట్టారని చెబుతున్నారు.
ప్రస్తుతం రేవంత్‌కు ఏ ఒక్క సీనియర్ కూడా మద్దతుగా లేరు. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ .. రేవంత్ అరెస్టును కనీసం ఖండించను కూడా ఖండించలేదు. కోమటిరెడ్డి తానే పీసీసీ చీఫ్‌ని అని ఢిల్లీలో సోనియాను కలిసి ప్రకటించుకున్నంత పని చేశారు. ఇక వీహెచ్, జగ్గారెడ్డి లాంటి వాళ్లు.. రేవంత్ పీసీసీ చీఫ్ ఏమిటి.. ఆయన కన్నా తామే బలమైన నేతలమని పోటీ పడి ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. సీనియర్ల కన్నా.. పార్టీ క్యాడర్లో మాత్రం.. రేవంత్ పై సదభిప్రాయం ఉంది. ప్రభుత్వంపై పోరాడితే.. ఎదురుతిరగడానికి చాలా మంది ఉన్న నిఖార్సైన లీడర్ లేకనే.. వారంతా సైలెంట్ గా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. వారిలో మత్రం రేవంత్ పీసీసీ చీఫ్ అయితే బాగుండని అనుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వారమే వచ్చే అవకాశం ఉందని.. ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.