స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు గా ప్రకటించింది. అయితే ఎన్నికల సంఘం ప్రకటన పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ విషయంలో వైఎస్ఆర్ సీపీ నేతల రౌడీయిజం, దౌర్జన్యాలపై ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళితే..
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాల పరిస్థితి రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. మాచర్లలో టిడిపి నేతలపై వైసీపీ నేతలు దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేయడం, పలుచోట్ల జనసేన అభ్యర్థుల పై దాడులు బెదిరింపులకు పాల్పడి వారి నామినేషన్ పత్రాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు చించి వేయడం తెలిసిందే. వైఎస్ఆర్సిపి దౌర్జన్యాలను, వైఎస్ఆర్సీపీకి వంత పాడిన అధికారుల చిట్టాను, కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. పలుచోట్ల విపక్ష అభ్యర్థులను బెదిరించి వారిని నామినేషన్లు వేయకుండా చేసి వైసీపీ నేతలు ఏకగ్రీవం చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎన్నికలను వాయిదా వేయడం మాత్రమే కాకుండా ప్రక్రియను మొదటి నుండి ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేశారు.
మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.