కరోనా వైరస్‌ను అరికట్టడానికి ఒక్క పారాసిటమాల్ చాలని.. ఏ సైంటిస్ట్.. ఏ పరిశోధన చేసి చెప్పారో కానీ.. చాలా మందికి అది నచ్చేసింది. అదేమంత సీరియస్ కాదు.. అని అని.. ప్రజల్ని అలా కరోనాకు వదిలేసి.. తమ పనులు తాము చక్కబెట్టుకోవడానికి ఈ పారసిటమాల్ ధీయరిని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం.. అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ అదే మాట చెప్పారు. తనదైన మాటల చాతుర్యంతో దాన్ని చెప్పారు. అందరూ విరగబడి నవ్వారు. అప్పుడు ఆయన కామెడీగా చెప్పారో.. సీరియస్‌గా చెప్పారో చాలా మందికి అర్థం కాలేదు. అది కేసీఆర్ స్టైల్. కానీ ఇప్పుడు ఆయన అనుంగు మిత్రుడు.. ఆయన సలహాలను తూ.చ తప్పకుండా పాటిస్తారని పేరున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా.. అదే పారసిటమాల్ ఫార్ములానే.. కరోనాకు కరెక్ట్ అని వాదిస్తున్నారు.
కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయడం ఇష్టపడిన జగన్… ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. కరోనా ఎంత డేంజర్ కాదో వివరించే ప్రయత్నం చేశారు. కరోనా ఎవరికి డేంజర్ అవుతోందో.. ఓ కొత్త పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అరవై ఏళ్లు నిండిన వారికే వస్తుందని.. ఇతర రోగాలు ఉన్న వారికే ప్రాణాల మీదకు తెస్తుందని.. వివరించారు. దానికి ట్రీట్మెంట్, పారాసిటమాల్ మాత్రమేనని.. తేల్చేశారు. ఇంకా.. నివారణ కోసం బ్లీచింగ్ చాలన్నారు. ఇంత చిన్న దానికి ఎన్నికలు వాయిదా వేయడమేమిటని మండిపడ్డారు. అలా చెప్పిన ముఖ్యమంత్రి తాను.. టన్నుల కొద్ది పారాసిటమాల్ టాబ్లెట్లను అందుబాటులో తెచ్చి.. పోరాటానికి సిద్ధమయ్యానని చెప్పలేదు. ఎక్కడికక్కడ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని.. కరోనాను ఎదుర్కోవడానికి సర్వసిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.
మరి పారాసిటమాల్‌తో పోయేదానికి.. నెల్లూరులో ఒక్క కరోనా పాజిటివ్ కేసు బయటపడానే.. నెల్లూరును బ్లాక్ చేసేసి.. జనాల్ని ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి.. అన్ని జాగ్రత్తలను ఎందుకు తీసుకుంటున్నారో …చెప్పలేకపోయారు. ఆ కరోనా పాజిటివ్ రోగికి.. ఒక్క పారాసిటమాల్ వేసి.. ఇంటికి పంపేయాల్సింది కదా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.