స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై.. తెలుగుదేశం పార్టీ చాలా రోజులుగా విమర్శలు గుప్పిస్తోంది. ఆర్డినెన్స్ దగ్గర్నుంచి నామినేషన్ల వరకూ ప్రతీ విషయంలోనూ.. ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నిస్తూనే ఉంది. ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవడం.. ఎలాంటి స్పందన లేకపోవడంపై.. రోజువారీ విమర్శలు చేస్తూనే ఉంది. ప్రభుత్వ ఒత్తిడికి ఎస్ఈసీ లొంగిపోయిందని చెప్పుకున్నారు. కానీ.. ఎప్పుడైతే.. భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగిందో అప్పుడే పరిస్థితి మారిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ – జనసేన పొత్తులు పెట్టుకున్నాయి. ఆ పొత్తులు పెట్టుకున్నా… వారు బలమైన పోటీ దారులు కాదు. కానీ.. భారతీయ జనతా పార్టీ నేతల్ని కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదు.
చిత్తూరు జిల్లాలో.. అలాగే మాచర్లో బీజేపీ – జనసేన నేతల్ని.. వెంట పడి మరీ కొట్టి నామినేషన్లు ఉపసంహరింపచేశారు. ఈ పరిస్థితుల్ని చూసి..బీజేపీ నేతలకు మండిపోయింది. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు వేయనివ్వకపోతే పట్టించుకునేవారు కాదేమో కానీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. తమ నామినేషన్లను కూడా వేయనివ్వకుండా.. అదీ కూడా వెంంటపడి కొట్టడం అంటే.. చాలా అది వారి ఇజ్జత్ కా సవాల్ లాంటిది. వెంటనే.. .జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో ముగ్గురు ఎంపీలు నేరుగా అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో.. కన్నా లక్ష్మినారాయణ… అమిత్ షాకు లేఖ రాశారు. ఏపీలో స్థానిక సంస్థలు జరుగుతున్న పరిస్థితులపై వారు సమగ్ర నివేదిక ఇచ్చారు. అప్పుడే.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని వారికి అమిత్ షా హామీ ఇచ్చారు.
ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆదివారం రోజు.. మాచర్లలో ఓ బీజేపీ -జనసేన కూటమి అభ్యర్థితో బలవంతంగా నామినేషన్ ఉపసంహరింప చేస్తున్న ఫోటోలు పాతక శీర్షికల్లో వచ్చాయి. వెంటనే ఢిల్లీకి నివేదిక వెళ్లడం జరిగిపోయిందని అంటున్నారు. అదేసమయంలో.. కరోనా పై.. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఏ చేయాలన్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర వర్గాలను సంప్రదించారు. వారు ఆరు వారాల పాటు వాయిదా వేయమని సూచించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రెస్నోట్లోనే తెలిపింది. మొత్తంగా చూస్తే.. టీడీపీపై దాడుల వ్యవహారం కాదు కానీ.. బీజేపీ పై దాడులు చేయడం.. మొత్తానికే ఎసరు తెచ్చిందన్న అభిప్రాయం మాత్రం.. కలుగుతోంది.