స్థానిక ఎన్నికలు వాయిదా పడడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు జగన్ హుటాహుటిన గవర్నర్ ని కలవడం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కులం అంటగడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రిగా తన అధికారాలు ఎక్కువా లేక ఎన్నికల కమిషన్ అధికారాలు ఎక్కువా అంటూ చిన్న పిల్లాడి లా మాట్లాడడం, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే జగన్ వ్యాఖ్యలపై అటు విపక్ష నేతలే కాకుండా, పలువురు ప్రముఖులు స్పందించారు.
మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈయన గతంలో చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసి జగన్ ని సమర్థించిన సంగతి తెలిసిందే. ఆయన ట్వీట్ చేస్తూ, “ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందా అనే ఒక్క విషయం తప్పితే మిగిలిన అన్ని విషయాలలో అధికారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై పూర్తయ్యేవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాని దే.” అని రాసుకొచ్చారు. ఇక బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యాంగ పదవి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారాలు ఏమిటి అన్న విషయం తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం శోచనీయం అంటూ జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని, ఐరోపా లోని కొన్ని దేశాలలో స్థానిక ఎన్నికలు ఈ వైరస్ కారణంగానే వాయిదా వేశారని, మన దేశంలో కూడా ఆరు రాష్ట్రాలలో అనేక వ్యవహారాలను పూర్తిగా మూసివేశారని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాల కన్నా అధికారమే ఎక్కువ అన్నట్లుగా జగన్ వ్యవహరించడం సరి కాదని చంద్రబాబు అన్నారు. ఇక మాజీ మంత్రిభూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని జగన్ వైరస్ పట్టిపీడిస్తోంది అని అన్నారు.
అయితే అటు వైఎస్సార్ సీపీ నేతలు కూడా వీటికి దీటుగా స్పందిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఐదువేల కోట్లు ఎన్నికల వాయిదా వల్ల రాష్ట్రం కోల్పోయిందని వారంటున్నారు. పైగా కరోనా వైరస్ కంటే క్యాస్ట్ వైరస్ మరింత ప్రమాదకరం అంటూ అంబటి రాంబాబు వంటి నేతలు చంద్ర బాబు పై సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.