తెలంగాణలో ముఖ్యమంత్రిని కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఇలాంటి దూకుడే అవసరమని భాజపా జాతీయ నాయకత్వం భావించింది! అందుకే, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని ఎంపీ బండి సంజయ్ కి అప్పగించిందని అనుకోవచ్చు. ఆయన కూడా, ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ మొదటి రోజు నుంచే దూకుడు మొదలుపెట్టారు. రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యాక హైదరాబాద్ లో జరిగిన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. భాజపాకి అధికార యావ ఎప్పుడూ ఉండదన్నారు!! జాతీయవాదం, దేశభక్తి, హిందుత్వ ఈ మూల సిద్ధాంతాలకు తెలంగాణలో సంకట స్థితిలో ఉన్నాయి కాబట్టి, వాటిని రక్షించడం కోసమే భాజపా ఇక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మజ్లిస్ లాంటి దేశద్రోహులు, తెరాసతో కలిసి సాగుతున్నారని విమర్శించారు. భైంసా ఘటన గురించి మాట్లాడుతూ, మళ్లీ అక్కడికి వెళ్తా, ధర్మ రక్షకులుగా నిలిచిన సోదరుల్ని కాపాడుకుంటా, అక్రమ కేసులతో జైల్లో పెట్టిన తమ్ముళ్లను కలవడానికి వస్తా అన్నారు సంజయ్.
నికార్సయిన హిందువు తానేనీన, యజ్ఞ యాగాలు చేసేది తానేనని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటారన్నారని సంజయ్ అన్నారు. స్వార్థం కోసం, కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కోసం చేసిన పూజల్ని హిందూ సమాజం గుర్తించదన్నారు. హిందూ సమాజం కోసం, దేవుళ్ల కోసం నిలబడ్డవారినే నిజమైన హిందువులుగా సమాజం గుర్తిస్తుందన్నారు. అభివృద్ధి అని కేసీఆర్ మాట్లాడుతుంటారనీ, డబుల్ బెడ్ ఇళ్లకు కేంద్రమే నిధులిస్తోందనీ, హరిత హారానికీ, కాళేశ్వరం ప్రాజెక్టుకీ… ఇలా చెబుతూపోతే అన్నింటికీ కేంద్రం ఇచ్చిన పైసలే అన్నారు. కేంద్రం నుంచి ఇంకా ఏం కావాలన్నా నేను తీసుకొస్తా, నాతో ఢిల్లీకి వస్తావా, కేంద్రాన్ని అడిగి అన్నీ తీసుకొద్దాం అంటూ కేసీఆర్ కి సవాల్ చేశారు బండి సంజయ్. ఖబడ్దార్ కేసీఆర్, రేపట్నుంచీ యుద్ధం ప్రారంభం, ఇవాళ్టి నుంచే నీకు కౌంట్ డౌన్ అంటూ హెచ్చరించారు!
నేరుగా కేసీఆర్ మీదే మాటల దాడి ప్రారంభించారు సంజయ్. ఇక తన లక్ష్యం అదే అన్నట్టుగా ప్రారంభోన్యాసం ఇచ్చారు. తెలంగాణలో కూడా భాజపా మార్కు హిందుత్వ అంశాన్నీ, దేశభక్తిని నేపథ్యంగా చేసుకునే సంజయ్ కార్యాచరణ ఉంటుందని అర్థమౌతోంది. గతంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల హయాంలో భాజపాకి ఉన్న ఇమేజ్ కంటే… ఇప్పుడు సంజయ్ నాయకత్వం ఉండబోయే ఇమేజ్ మరో విధంగా ఉండేట్టుగా కనిపిస్తోంది. జాతీయ నాయకత్వం ఆశిస్తున్న వ్యూహాత్మక రాజకీయ పంథా అదే కదా!