స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపింది. పైగా ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కులం అంటగడుతూ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే వాయిదా నిర్ణయాన్ని రద్దు చేయడానికి ఇటు వై ఎస్ ఆర్ సి పి ప్రయత్నిస్తుంటే , రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణ అధికారాలను ఉపయోగించి తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ రమేష్ కుమార్ నిర్ణయాన్ని ప్రకటించగానే జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ ని కలిసి ఫిర్యాదు చేశారు. రమేష్ కుమార్ తో సంజాయిషీ తీసుకోవాలని జగన్ కోరారు. గవర్నర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ అంశాన్ని ఇంకా పైకి తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ రోజు రమేష్ కుమార్ గవర్నర్ భేటీ కానున్నారు. తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను రమేష్ కుమార్ గవర్నర్ కు తెలియజేయనున్నారు. బ్యాలెట్ పేపర్ పై కరోనా దాదాపు ఐదు రోజులు నివసించ గలదని, అలాగే చెక్కతో చేసిన బ్యాలెట్ బాక్సుల పై కూడా ఐదు రోజులపాటు కరోనా ఉంటుందని, కరోనా వైరస్ సోకిన ఒక వ్యక్తి ఎన్నికల్లో పాల్గొన్నా కూడా మొత్తం ప్రజలందరి పాలిట అది భస్మాసుర హస్తం అవుతుందని రమేష్ కుమార్ గవర్నర్ కు వివరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఇదే సమయంలో విజయసాయిరెడ్డి ఈ వాయిదా నిర్ణయం పై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లో ముగిసిపోయే ప్రక్రియను కరోనా పేరు చెప్పి వాయిదా వేయడం కారణంగా రాష్ట్రం నిధులను కోల్పోతుందని విజయ సాయి రెడ్డి తరపున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణాధికారాలు ఉపయోగించి రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే అవకాశం వైఎస్ఆర్సిపి కి ఉండకపోవచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు సైతం ఎలక్షన్ కమిషన్ విచక్షణాధికారాలు, గవర్నర్ విచక్షణాధికారాలు, స్పీకర్ విచక్షణాధికారాలు వంటి అంశాల లో జోక్యం చేసుకోవడానికి గతంలో నిరాకరించిన సంగతి గమనార్హం.