నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ది… తన సామాజికవర్గమే కాబట్టి.. చంద్రబాబు.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించుకున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయనను తాను నియమించలేదని చెప్పుకొచ్చారు. నిజానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ని అంత తేలిగ్గా నియమించడానికి .. తీసేయడానికి అవకాశం ఉంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అధికారయంత్రాన్ని ప్రక్షాళన చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పుడే మార్చి ఉండేవారు. కానీ.. ఎస్‌ఈసీది రాజ్యాంగపరంగా స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. ఆయనను తొలగించడానికి అవకాశం లేదు. అందుకే మిన్నకుండిపోయారు. అలాగే నియామకం కూడా.. ప్రభుత్వం జరపదు గవర్నర్ నియమిస్తారు. 2015లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియామకం జరపాల్సిన అవసరం ఏర్పడింది. నియమించాల్సింది గవర్నరే అయినా… ప్రభుత్వానికి చాయిస్ ఉంటుంది. ఆ మేరకు.. అప్పుడే రిటైర్ అయిన.. సీఆర్ బిశ్వాల్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్ నరసింహన్ కు పంపారు. కానీ.. నరసింహన్ అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం.. ఎస్‌ఈసీకి హైకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా ఉంటుందని.. దానికి .. ఐఏఎస్‌గా చీఫ్ సెక్రటరీ స్థాయికి చేరిన వారే అర్హులని ఫైల్ ను వెనక్కి పంపారు.
ఆ సమయంలో… ఏపీ సర్కార్ కు.. గవర్నర్ నరసింహన్ మధ్య సంబంధాలు గొప్పగా లేవు. చాలా అంశాల్లో గవర్నర్ తో ప్రభుత్వం విబేధిస్తోంది. అలాంటి సమయంలో.. బిశ్వాల్ నియామకంపై ఫైలును వెనక్కి పంపడమే కాదు.. అన్ని విధాలుగా అర్హుడని.. తన వద్ద ఏడేళ్లగా.. సెక్రటరీగా పని చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరును.. గవర్నర్ ప్రతిపాదించారు. చంద్రబాబు పట్టుదలతో ఓ సారి ఫైల్ వెనక్కి పంపినప్పటికీ..గవర్నర్ వెనక్కి తగ్గలేదు. అప్పట్లో ఈ అంశంపై మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చంద్రబాబు చెప్పిన అధికారిని నరసింహన్ ఎస్‌ఈసీగా నియమించడానికి అంగీకరించలేదని… చంద్రబాబుకు ఎదురుదెబ్బ అని ప్రచారం కూడా చేశారు. చివరికి చంద్రబాబు గవర్నర్ ప్రతిపాదననకు అంగీకరించక తప్పలేదు. ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు చెప్పారు. తన చాయిస్ బిశ్వాల్ అయితే.. రమేష్ కుమార్ ను గవర్నర్ రికమెండ్ చేశారని కుండబద్దలు కొట్టేశారు. అంటే చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందనప్పటికీ.. బిశ్వాల్ ను ఎస్‌ఈసీగా నియమించాలనుకున్నారు.. తన సామాజికవర్గానికి చెందినప్పటికీ.. నిమ్మగడ్డను తాన చాయిస్ కాదనుకున్నారు.
కానీ ముఖ్యమంత్రి మాత్రం.. దీనికి భిన్నంగా చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అఫీసరే. కానీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న పధ్నాలుగేళ్ల కాలంలో…ఆయనకు ఎప్పుడూ ప్రాధాన్యతా పోస్టులు దక్కలేదు. లూప్ లైన్‌లోనే ఉండిపోయారు. దానికి కారణాలు ఏమిటో తెలియదు కానీ.. వైఎస్ హయాంలో మాత్రం.. ఆర్థిక శాఖ లాంటి ముఖ్యమైన శాఖల్లో పదవులు పొందారు. ఆ తర్వాత గవర్నర్ వద్ద ఏడేళ్లు కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ సర్కిల్స్‌లో .. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబుకు కానీ.. టీడీపీకి కానీ ఫేవర్ ఉంటారన్న ప్రచారమే ఉండదు. అయినప్పటికీ.. ప్రస్తుతం స్థానిక ఎన్నికల వాయిదా విషయంలో.. చంద్రబాబు సామాజికవర్గానికి ముడిపెట్టి విమర్శలు మాత్రం.. వైసీపీ నేతలు గుప్పిస్తున్నారు.