జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడిన పరిస్థితిని మరింత సమర్థంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా షూటింగ్లు వాయిదా పడటంతో.. ఆయన స్థానిక ఎన్నికల్లో జరిగిన హింసను.. జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు సందేశం పంపించారు. వైసీపీ నేతలు స్థానిక ఎన్నికల్లో చేసిన హింసపై మౌనంగా ఉంటే మరింత పెట్రేగిపోతారని.. నామినేషన్ దశలో ఎదురైన ఇబ్బందులు, దాడులపై సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. దాడులు చేసి ఇబ్బందులు పెడుతున్నా రక్షించని అధికారుల వివరాలు ఆధారాలతో సహా తెలియచేయాలని సూచించారు. పూర్తి నివేదికను కేంద్ర హోంశాఖకు స్వయంగా అందజేస్తానన్నారు.
స్థానిక ఎన్నికల సమరంలో.. పలు చోట్ల.. టీడీపీ నేతలపైనే కాదు.. బీజేపీ, జనసేన కార్యకర్తలపైనా దాడులు జరిగాయి. చిత్తూరు జిల్లాలో జనసేన నేతలపై ఎక్కువగా దాడులు జరిగాయి. మాచర్లలోనూ జనసేన తరపున పోటీ చేసిన యువకుడిని తీవ్రంగా బెదిరించి.. నామినేషన్ ఉపసంహరించుకునేలాచేశారు. ఇలాంటి పరిణామాలన్నింటిపై.. ఇప్పుడు ఆధారాలతో సహా.. ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్..ఎన్నికలు వాయిదా కాదు.. రద్దు చేసి..మళ్లీ నామిషషన్ల నుంచి ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏకగ్రీవాలన్నీ.. బెదిరించి చేసినవనేనని.. ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు కేంద్రం దృష్టికి ఈ దాడుల వ్యవహారాల్ని తీసుకెళ్లి…మరింత పకడ్బందీగా వైసీపీ పై పోరాటం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే.. స్థానిక ఎన్నికల వాయిదా వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా.. బీజేపీ, జనసేన నేతలు ఆధారాలతో సహా ఢిల్లీకి ఫిర్యాదులు పంపిస్తే.. మొత్తానికి..కేంద్రం జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియను రద్దు చేసే అవకాశం ఉందని.. జనసేన నేతలు నమ్ముతున్నారు. పవన్ కల్యాణ్ తల్చుకుంటే.. ఏం చేయగలరో చూపిస్తారని అంటున్నారు.