తెలుగుదశం పార్టీ హయాలంలో పోలవరం అంచనాలు విపరీతంగా పెంచేశారని.. దోచుకోవడానికే ఆ పని చేశారంటూ.. వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీకి చెందిన మీడియాలో కథలు కథలుగా ..పేజీలకు పేజీలు రాశారు. అయితే..అధికారంలోకి వచ్చిన తర్వాత అవే అంచనాలకు కట్టుబడ్డారు. ఆ అంచనాలన్నీ కరెక్టేనని కేంద్రానికి చెప్పారు. వాటిని ఆమోదించాలని కోరారు. ఆలస్యమైతే ఇంకా అంచనాలు పెరుగుతాయని జలవనరుల శాఖ అధికారులు.. కేంద్రంతో ఆమోద ముద్ర వేయించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే.. గతంలో.. వైసీపీ చేసిన ఆరోపణల ఎఫెక్ట్ ఇప్పుడు బాగా కనిపించింది. అంచనాలను.. వైసీపీ ఆరోపణలకు తగ్గట్లుగానే… దాదాపుగా రూ. ఎనిమిది వేల కోట్లను కోసేసింది.
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో ఏకంగా రూ.7,823.13 కోట్లకు కోతపడింది. కేంద్రం నియమించిన అంచనాల సవరణ కమిటీ ఏడాదిపాటు పరిశీలన జరిపి ఈ అంచనాలను ఖరారు చేసింది. ఈ అంచనాల కమిటీకి వైసీపీ తరపు నుంచి గతంలో అనేక ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. నిజానికి అప్పటి ప్రభుత్వం 2017-18 ధరల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలు పంపింది. కానీ వెంటనే ఆమోద ముద్రపడలేదు. వివిధ రకాల ఫిర్యాదులు వైసీపీ సహా ఇతురల నుంచి రావడంతో ప్రక్రియ మెల్లగా సాగింది. ఇప్పుడు.. ఆ అంచనా వ్యయం మరింత ఎక్కువగాఉంటుంది.
ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో దాదాపు రూ.5000 కోట్ల మేర పునరావాస వ్యయంలోనే కోత పడినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. భూములు కోల్పోయేవారు తీవ్రంగా నష్టపోతారు. వాటిని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. నిర్వాసితులయ్యే వారికి … అసలు మార్కెట్ ధర కన్నా రెండు రెట్టు ఎక్కువగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాంతో.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీనే భారీగా పెరిగింది. ప్రధానమైన డ్యామ్ తో పోలిస్తే.. సహాయ, పునరావాస చర్యలు ఐదురెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం… రూ. ఎనిమిది వేల కోట్ల వరకూ వెచ్చించాల్సి ఉంది. గతంలో రాజకీయం కోసం చేసిన ఆరోపణలు.. ఇప్పుడు ప్రభుత్వంలో మారిన తర్వాత ప్రభుత్వానికి నష్టం కలిగించాయని… జలవనరుల నిపుణులు అంటున్నారు.