స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేస్తూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్సిపి వేసిన పిటిషన్ పై విచారణ సుప్రీం కోర్టులో వాయిదా పడింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమిషనర్ చెబితే, కరోనా కి అంత భయపడాల్సిన పని లేదని, ఎన్నికలు నిర్వహించవచ్చని అంటూ వైఎస్ఆర్సిపి వేసిన పిటిషన్ అదే కరోనా కారణంగా వాయిదా పడింది. వివరాల్లోకి వెళితే..
స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆరు వారాల పాటు వాయిదా వేయడం, తనకు మాట మాత్రమైనా చెప్పకుండా రమేష్ కుమార్ వాయిదా వేశారని జగన్ మండిపడడం, తద్వారా కలిగిన రాజకీయ ప్రకంపనలు తెలిసిందే. అయితే రమేష్ కుమార్ నిర్ణయంపై వైఎస్ఆర్సిపి సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పిటిషన్ పై ఈరోజు జరగవలసిన విచారణ వాయిదా పడింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటాయన్న దానిపై సందిగ్ధత నెలకొంది. కరోనా వైరస్ కారణంగా సుప్రీంకోర్టు లోని అన్ని ధర్మాసనాలు ఈరోజు విచారించవలసిన పిటిషన్లను వాయిదా వేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయకూడదు అంటూ అధికార వైఎస్ఆర్సిపి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ పిటిషన్లను తిరిగి ఎప్పుడు విచారిస్తారు అన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.
అయితే కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేస్తే, కరోనా అంత ప్రమాదకరం కాదని, దాని కారణంగా ఎన్నికలను వాయిదా వెయ్యవలసిన అవసరం లేదు అంటూ వైయస్సార్సీపి వేసిన పిటిషన్ పై విచారణ అదే కరోనా వైరస్ కారణంగా వాయిదా పడడం పారడాక్స్ లా కనిపిస్తుంది. మొత్తానికి కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయడం సమంజసమేనని పరోక్షంగా సుప్రీంకోర్టు , తమ పిటిషన్ల విచారణను కరోనా కారణంగా వాయిదా వేయడం ద్వారా సూచించినట్లు అయిందని , వైఎస్ఆర్సిపి వాదనలోని డొల్లతనాన్ని బయట పెట్టడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది అని సెటైర్లు వినిపిస్తున్నాయి.