ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించాల్సిన సమయం దగ్గర పడుతూంటే.. ఇంత వరకూ ఆ పని చేయడానికి కనీసం ఆదేశాలు కూడా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం… సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. కార్యాలయాలకు వేసే రంగుల అంశాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద హైకోర్టులో విచారించడంపై రాష్ట్ర ప్ఱభుత్వం పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందో లేదో తెలియదు కానీ.. మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ సమయంలో… సుప్రీంకోర్టు స్టే ఇస్తే.. బయటపడవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది.
ప్రభుత్వం…భవనాలపై రంగులు ఉండాలా వద్దా అన్న చర్చను పిటిషన్లో రానీయలేదు. ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు వేయడంపై.. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించడంపైనే… రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది న్యాయవాద వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. న్యాయవ్యవస్థకు ఉన్న విచారణ పరిమితులను ప్రశ్నిస్తూ.. నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేయడం… ఏమిటన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వానికి.. ప్రజా ధనం ఖర్చుకు సంబంధించిన ప్రతీ అంశంలో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను స్వీకరించడం.. విచారణ జరపడం..న్యాయవ్యవస్థ విధుల్లో ఒకటి. దీనినే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం.. అనూహ్య పరిణామంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ కార్యాలయాలపై ఏ పార్టీ రంగులు ఉండకూడదు. అది నిబంధన. ఈవిషయాన్ని హైలెట్ చేస్తే.. సుప్రీంకోర్టు స్టే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదని అంచనాకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయనిపుణులు… అలా కాకుండా.. హైకోర్టుకు పిల్ విచారణార్హతపై పిటిషన్ దాఖలు చేస్తే.. తీర్పుపై స్టే వస్తుందన్న తెలివి ప్రదర్శించారని అంటున్నారు. తర్వాత ఎప్పటికైనా… హైకోర్టుకు విచారణ అర్హత ఉందని… సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందేమో కానీ.. అప్పటి వరకూ స్టే వస్తుంది కదా అన్న ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు.