స్థానిక సంస్థలఎన్నికల వాయిదా విషయంలో.. ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సహాని తనకు రాసిన లేఖపై.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. స్పందించారు. తాను పూర్తి వివరాలతో… సూటిగా.. సమాధానం పంపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట మాత్రంగా చెప్పకుండా.. ఎవరితోనూ.. చర్చించకుండానే స్థానిక ఎన్నికలు వాయిదా వేశారంటూ.. ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ప్రచారాన్ని.. రమేష్ కుమార్.. తన లేఖలో ఖండించేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో తాను నిరంతరం టచ్‌లో ఉన్నారని..ఈ మేరకు 14వ తేదీన తన ఆఫీసులో.. సమావేశం కూడా జరిగిందని.. వాటికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కావాలంటే కాల్ రికార్డులు ఉన్నాయన్నారు.
30వ తేదీలోపు ఎన్నికలు జరగకపోతే.. ఆర్థిక సంఘం నిధులు రావంటూ.. సీఎస్ రాసిన లేఖలో పేర్కొనడంపై.. రమేష్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను రాజ్‌భవన్‌లో ఏడేళ్లు పని చేసినప్పటికీ.. అంతకు ముందు ఆర్థిక శాఖ సెక్రటరీగాపని చేసిన విషయాన్ని నీలం సహానికి లేఖలో గుర్తు చేశారు. తాను ఆర్థిక శాఖలో పని చేసినప్పుడు.. ఆర్థిక సంఘానికి సంబంధించిన విషయాలను కూడా డీల్ చేశానన్నారు. కేవలం.. ఎన్నికలు జరపలేకపోయినంత మాత్రాన నిధులు ఆపేయరని.. స్పష్టం చేశారు. నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే.. ఎన్నికల సంఘం తరపున తన వంతు సాయం అందిస్తానని స్పష్టం చేశారు. ఏపీలో కరోనా వ్యాప్తి కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్న సీఎస్ .. మాటలను.. ఎస్ఈసీ అభినందించారు.
అయితే.. దేశవ్యాప్తంగా ర్యాపిడ్‌గా వ్యాపిస్తున్న వైరస్.. కేంద్రంతో సంప్రదింపులు.. ఇతర రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో పరిస్థితులపై అధ్యయనం చేసిన తర్వాతనే తాను నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. ఇప్పటికే ఒడిషా, మహారాష్ట్ర, బెంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన విషయాన్ని లేఖలో.. సీఎస్ గుర్తు చేశారు. ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నప్పటి నుండి.. స్టేట్ ఎలక్షన్ కమిషన్‌పై.. కమిషనర్‌పై వ్యక్తిగతంగా.. జరుగుతున్న దాడిపై రమేష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజ్యాంగపరమైన విధులను.. లోపం లేకుండా నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. అలాగే.. సమన్వయంతో పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.
కోడ్ అమల్లో ఉండగా.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలను.. సీఎస్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ వాటిని అమలు చేయలేదు. దీని గురించి.. రమేష్ కుమార్ లేఖలో ఎక్కడా పేర్కొనలేదు. ప్రభుత్వం.. రమేష్ కుమార్ వైఖరిపై తీవ్ర అసహనంతో ఉన్న నేపధ్యంలో.. రిప్లయ్ లేఖకు… సీఎస్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.