‘మనసంతా నువ్వే’ లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాన్ని అందించాడు వి.ఎన్ ఆదిత్య. ఆ తరవాత స్టార్ హీరోలతో పనిచేశాడు. నిర్మాతగానూ మారాడు. కానీ… ఆ స్థాయి విజయం మాత్రం లభించలేదు. చాలా కాలం ఆయన సినిమాలే తీయలేదు. ఇప్పుడు, ఇంత కాలానికి… ‘వారిద్దరి మధ్య ‘ అనే ఓ యూత్ ఫుల్ చిత్రాన్ని తీశారు. సినిమా పూర్తయింది. ఏప్రిల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా పబ్లిసిటీ డిఫరెంట్గా సాగుతోంది. ముఖ్యంగా పోస్టర్లలో హీరో, హీరోయిన్లు కనిపించకుండా… యానిమేషన్లతో నడిపించేస్తున్నాడు.
దానికితోడు సోషల్ మీడియాలో.. కొన్ని సాహసోపేతమైన కామెంట్లు చేస్తున్నాడు ఈ దర్శకుడు. తనని హీరోలు, హీరోయిన్లు ఎలా తిప్పించారో, ఈ కథని ఎలా రిజెక్ట్ చేశారో చెబుతూ ఓ సెటైరికల్ పోస్ట్ ని ఎఫ్.బీలో పెట్టాడు ఆదిత్య. `హీరోయిన్ నచ్చలేదు. ఆమెను చూస్తే ప్రేమించాలనిపించడం లేదు. కాబట్టి ఈ సినిమా వదులుకుంటున్నాను` అని ఓ హీరో చెప్పడం హైలెట్ అసలు. ఫలానాహీరో నటిస్తే నేను చేయను అని ఓ హీరోయిన్ మొహం మీదే చెప్పేసిందట. యూత్ దర్శకులతో మాత్రమే చేస్తానని మరో హీరో అన్నాడట. అలా.. ఈ సీనియర్ దర్శకుడ్ని బాగా ఆడుకున్నారు. అయితే… వాళ్లందరికీ సమాధానం ఈ సినిమాతోనే చెబుతానన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ వెటరన్ డైరెక్టర్. ఇదంతా కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది.. సినిమా చూస్తే గానీ తెలీదు.