ప్రపంచాన్ని కబళించే ప్రయత్నంలో ఉన్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చివరి క్షణంలో.. ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికీ దేశం మొత్తం ఓ తరహా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోకి వెళ్లిపోయి… నిర్మానుష్యంగా మారిపోగా.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. తమ దగ్గర పరిస్థితి అంత తీవ్రంగా లేదని… ఎన్నికలు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వాదిస్తోంది. ఎన్నికలను ప్రయారిటీగా తీసుకున్న ఏపీ సర్కార్… పరిమితులు విధిస్తే.. తమ వాదనకు బలం చేకూరదన్న ఉద్దేశంతో.. స్కూళ్లు, కాలేజీల మూసివేతకు.. ఈ రోజు వరకూ అంగీకరించలేదు. అయితే.. సుప్రీంకోర్టు ఎన్నికల నిర్వహణ ఇప్పటికిప్పుడు కుదరదని.. అంతా ఎన్నికల కమిషన్ ఇష్టమని తేల్చేయడంతో.. ప్రభుత్వం రంగంలోకి దిగింది.
రేపటి నుంచే అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు కూడా మూసివేయాలని ఆదేశించింది. సినిమా హాళ్లు, ఇతర జనం గుమికూడే ప్రాంతాల విషయంలోనూ ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతోందని.. కొద్ది రోజులుగా అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మరో వైపు చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల వారిని కూడా.. పరీక్షలు చేసిన తర్వాతనే రానివ్వాలన్న ఆంక్షలు విధిస్తున్నాయి.
మహారాష్ట్ర వాసుల రాకపై తెలంగాణ సర్కార్ అలాంటి ఆంక్షలే పెడుతోంది. కానీ ఏపీలో మాత్రం.. ఇంత వరకూ విదేశాల నుంచి ఎవరెవరు వచ్చారో.. వారికి ఎలాంటి పరీక్షలు చేశారో మాత్రం ఇంత వరకూ క్లారిటీ లేదు. ఎట్టకేలకు ప్రభుత్వం… ప్రజారోగ్యంపై దృష్టి పెట్టిందని తాజా నిర్ణయాలతో తెలుస్తోందంటున్నారు. ఇప్పటికే… కరోనా చాలా తీవ్ర స్థాయిలో దేశంపై దాడి చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందంటున్నారు.