ఎట్టకేలకు సీఎం కుమార్తె, మాజీ ఎంపీ కవిత రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టత కలిగించే నిర్ణయం తీసుకున్నారు! నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఆమె ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ఆ టికెట్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ చాలామంది చక్కర్లు కొట్టారు. చివరికి, తన కుమార్తెకి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి. నిజానికి, ఆమె రాజ్యసభకు వెళ్తారనే ప్రచారం కొన్నాళ్లుగా సాగింది. కానీ, ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా కవిత గెలుపు లాంఛనప్రాయమే అంటున్నారు తెరాస నేతలు.
గడచిన లోక్ సభ ఎన్నికల తరువాత క్రియాశీల రాజకీయాలకు కవిత దూరంగా ఉంటూ వచ్చారు. తెలంగాణ జాగృతి కార్యక్రమాలు కూడా తగ్గించేశారు. తనకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయిందనీ, రాజ్యసభకు వెళ్లాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే కథనాలు చాలా వచ్చాయి. చివరికి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆమె తెరమీదికి వస్తున్నారు. అయితే, ఆమె ఎమ్మెల్సీగా మాత్రమే కొనసాగుతారా… రాష్ట్ర మంత్రి మండలిలోకి వచ్చే అవకాశం ఉందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైపోయింది. రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పనిచేయాలన్నది ఆమె లక్ష్యంగా గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితకు మంత్రి పదవి సాధ్యమేనా అని పరిశీలిస్తే… ఇప్పటికే కేబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులున్నారు. ఒకరు రెడ్డి సామాజిక వర్గం, మరొకరు గిరిజన సామాజిక వర్గానికి చెందినవారున్నారు. కాబట్టి, వీళ్లలో ఏ ఒక్కరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదనే అనిపిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి కుమార్తె కోసం మంత్రి పదవి త్యాగం చేసేందుకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అంటే… నిజామాబాద్ కి చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి పేరు తెరమీదికి వస్తోంది. ఎందుకంటే, ఆయన కేసీఆర్ కి వీర విధేయుడు అంటారు! మరి, మండలిలోకి ఆమె వచ్చాక… ఆమెను ఎలా క్రియాశీలం చేస్తారో చూడాలి. ఇంకోటి… ఆమెకి మంత్రి పదవి ఇస్తే, ఒకే కుటుంబం నుంచి ఇంతమంది మంత్రులా అనే విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి. అంతేకాదు, ఆమెకి పార్టీలో మరింత ప్రాధాన్యత పెరిగితే… మరో అధికార కేంద్రంగా ఆమె చుట్టూ ఓ కోటరీ ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. తన వారసత్వ రాజకీయాలపై స్పష్టమైన వ్యూహంతో, హరీష్ రావు లాంటి నాయకుడి ప్రాధాన్యతను కూడా దశలవారీగా తగ్గించి ముందుకు సాగుతున్న కేసీఆర్, ఇవన్నీ లెక్కేసుకుంటారు కదా?