కేంద్ర హోంశాఖకు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ.. రాజకీయ సంచలనం సృష్టించింది. ఈ లేఖ ఆయన రాసింది కాదని.. కొన్ని చానళ్లు ప్రసారం చేశాయి. నిమ్మగడ్డ రమేష్‌కుమారే ఆ మాట చెప్పారని కూడా.. ఆయా మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి. కానీ లేఖ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాను కేంద్రానికి లేఖ రాశానని కానీ.. రాయలేదు అని కానీ ఆయన స్పష్టం చేయలేదు. ఇలాంటి విషయాల్లో మీడియాతో ఆయనకు పని లేదు. అధికారికంగా ఆయన చేయాల్సిన పనులను ఆయన చేస్తూ ఉంటారు. మీడియాకు సమాచారం ఇవ్వాల్సిన పని లేదు. కానీ.. ఆ లేఖ బయటకు రావడంతో.. సంచలనం అయింది. అయినప్పటికీ.. ఈ విషయంలో స్పందించేందుకు రమేష్ కుమార్ సిద్ధంగా లేరు. సోమవారమే.. సీఎస్‌కు ఆయన ఓ రిప్లయ్ లేఖ రాశారు. అందులో.. తాను మీడియాకు విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు. దానికి కారణం కూడా చెప్పారు. సీఎస్ .. తనకు రాసిన లేఖను.. తన కంటే ముందుగా మీడియాకు విడుదల చేసినందున.. తనకు ఇంకో ప్రత్యామ్నాయం లేకనే.. ఆ లేఖను మీడియాకు విడుదల చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అంటే.. సాధారణంగా.. రమేష్ కుమార్.. కారణం ఉంటే తప్ప.. లేఖల్ని మీడియాకు విడుదల చేయరని తేలిపోతుంది.
ఈ లేక నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేంద్రానికి పంపారన్నది నిజమని.. వైసీపీకి కూడా సమాచారం వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా.. రాత్రి సమయంలో అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ పెట్టి.. ఆ లేఖ .. హోంశాఖకు అందిందని.. అది తను రాయకపోతే… ఖండించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ స్పందనను బట్టి చూస్తే.. రమేష్ కుమార్ లేఖ కేంద్రానికి అందిందని స్పష్టమవుతోంది. దీన్ని ఖండించాలని వైసీపీ కోరుకుంటోంది. దాని కోసం.. కూడా వైసీపీ బెదిరింపుల మార్గాన్నే ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే.. అంబటి రాంబాబు.. ఈ లేఖ టీడీపీ ఆఫీసులో తయారయిందని.. ఇంకోటని.. తాము డీజీపీ ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖపై కేంద్ర ప్రభుత్వం కూడా.. చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆయనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించడంతో పాటు.. ఎన్నికల నిర్వహణ కోసం.. కేంద్ర బలగాలను పంపే అవకాశం ఉందంటున్నారు. నిమ్మగడ్డ రాసిన లేఖ సారాంశాన్ని బట్టి చూస్తే.. ఏకగ్రీవాలన్నింటినీ రద్దు చేసి.. మళ్లీీ ఎన్నికలు పెట్టే అవకాశాలను కొట్టి పారేయలేమని.. అంటున్నారు. ఏకగ్రీవాలు అసాధారణం.. ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అయిందంటున్నారు కాబట్టి.. ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినా ఆశ్చర్యం లేదంటున్నారు.